కొలంబో: ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఆరంభంలోనే కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. దనుష గుణతిలకా(4), కుశాల్ మెండిస్(11), ఉపుల్ తరంగా(5), షనక(0), జీవన్ మెండిస్(3) స్వల్ప వ్యవధిలో పెవిలియన్ కు చేరడంతో లంక 41 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఆ తరుణంలో కుశాల్ పెరీరా-తిషారా పెరీరా జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది. ఈ జోడి 97 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేయడంతో లంక తేరుకుంది.
ఓ దశలో వీరిద్దరూ చెలరేగి ఆడటంతో లంక స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఈ క్రమంలోనే కుశాల్ (61;40 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్) హాఫ్ సెంచరీ సాధించగా, ఆపై తిషారా(58;37 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా అర్థ శతకంతో మెరిశాడు. శ్రీలంక నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మన్ రెండు వికెట్లు సాధించగా, షకిబుల్ హసన్, మెహిదీ హసన్, రూబెల్, సౌమ్య సర్కార్‌లు తలో వికెట్ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment