
ముంబై: త్వరలో జరుగనున్న ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ను ఆతిథ్య దేశం ఇంగ్లండ్ గెలుచుకుంటుందని భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్ అభిప్రాయపడగా... కోహ్లి సారథ్యంలోని భారత జట్టే ఈ మెగా టోర్నీలో ఫేవరెట్‌గా బరిలో దిగి టైటిల్‌ను కైవసం చేసుకుంటుందని మరో మాజీ స్టార్ బ్యాట్స్‌మన్ దిలీప్ వెంగ్‌సర్కార్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. సోమవారం జరిగిన ‘టి20 ముంబై లీగ్’ ప్రారంభోత్సవంలో వీరిద్దరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గావస్కర్ మాట్లాడుతూ 2015 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన తర్వాత ఇంగ్లండ్ జట్టు పటిష్టమైన వన్డే జట్టుగా ఎదిగిందని సన్నీ విశ్లేషించాడు.
సొంతగడ్డపై ఆడనుండటం ఇంగ్లండ్‌కు కలిసొచ్చే అంశం కాబట్టి ఆ జట్టు ప్రపంచకప్‌ను అందుకునే అవకాశాలు ఈసారి ఎక్కువగా ఉన్నాయని వివరించాడు. అయితే భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ మాత్రం కోహ్లి సేనకే తన మద్దతు తెలిపాడు. ప్రపంచ కప్ గెలిచేందుకు భారత్‌కిదే అద్భుత అవకాశమని అన్నాడు. ‘ఈ టోర్నీలో భారత జట్టే ఫేవరేట్. కోహ్లి సేనకే టైటిల్ అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆటగాళ్లంతా మంచి ఫామ్‌ఉన్నారు’ అని వెంగీ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment