నాగ్‌పూర్: రంజీట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన విదర్భ టైటిల్‌ను నిలబెట్టుకుంది. సౌరాష్ట్రతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విదర్భ 78 పరుగుల తేడాతో విజయం సాధించి మరోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. విదర్భ విసిరిన 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సౌరాష్ట్ర తన రెండో ఇన్నింగ్స్‌లో 127 పరుగులకే కుప్పకూలి ఓటమి పాలైంది. దాంతో టైటిల్‌ను సాధించే అవకాశాన్ని కోల్పోయింది. విదర్భ బౌలర్లలో స్పిన్నర్ ఆదిత్య సర్వతే ఆరు వికెట్లతో సౌరాష్ట పతనాన్నిశాసించాడు. అతనికి జతగా అక్షయ్ వాఖరే మూడు వికెట్లు సాధించగా, ఉమేశ్ యాదవ్ వికెట్ తీశాడు.
సౌరాష్ట్ర ఆటగాళ్లలో విశ్వరాజ్ జడేజా(52) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టు సాధారణ లక్ష్యాన్ని ఛేదించడంలో చతికిలబడింది. నలుగురు మాత్రమే నాలుగు అంకెల స్కోరును దాటడంతో సౌరాష్ట్రకు పరాజయం తప్పలేదు. అంతకుముందు విదర్భ తన రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులు చేసింది. దాంతో విదర్భకు తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఐదు పరుగుల ఆధిక్యంతో 205 పరుగుల్ని బోర్డుపై ఉంచింది. ఆదిత్య సర్వతే (49), గణేశ్ సతీష్(35), మోహిత్ కాలే(38)లు క్లిష్ట దశలో మెరిసి జట్టు స్కోరును రెండొందలకు చేర్చారు. ఆ తర్వాత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సౌరాష్ట్ర 55 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 58/5 ఓవర్‌నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఇన్నింగ్స్‌ను కొనసాగించిన సౌరాష్ట్ర మరో 69 పరుగులు చేసి మిగతా వికెట్లను చేజార్చుకోవడంతో సౌరాష్ట ఓటమి పాలైంది.
Comments
Please login to add a commentAdd a comment