సాదాసీదా జట్టుగా గత సీజన్ బరిలో దిగి రంజీ ట్రోఫీని కైవసం చేసుకున్న విదర్భ... అదే అద్భుతాన్ని పునరావృతం చేసింది. నాలుగో ఇన్నింగ్స్ పోరాటాలతో ఫైనల్‌కు చేరిన సౌరాష్ట్రకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ట్రోఫీని మరోసారి ఒడిసిపట్టింది. తద్వారా తమ విజయ ప్రస్థానం గాలివాటం కాదని నిరూపించింది. దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీని నెగ్గాలన్న సౌరాష్ట్ర కల మూడోసారి చెదిరిపోయింది.
నాగ్‌పూర్: విజయంపై ఏమూలనో ఉన్న సౌరాష్ట్ర ఆశలను వమ్ము చేస్తూ... డిఫెండింగ్ చాంపియన్ విదర్భ 2018–19 సీజన్ రంజీ ట్రోఫీని ఖాతాలో వేసుకుంది. గురువారం ఇక్కడ ముగిసిన ఫైనల్లో ఆ జట్టు 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. 206 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 58/5తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సౌరాష్ట్ర 127 పరుగులకు ఆలౌటైంది. ఎడమచేతి వాటం స్పిన్నర్ ఆదిత్య సర్వతే (6/59), ఆఫ్ స్పిన్నర్ అక్షయ్ వాఖరే (3/37) ప్రత్యర్థి పనిపట్టారు. మ్యాచ్‌లో మొత్తం 11 వికెట్లు పడగొట్టడంతో పాటు, రెండో ఇన్నింగ్స్‌లో విలువైన 49 పరుగులు చేసిన సర్వతేకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
వారిద్దరి పోరాటం కాసేపే...
చేతిలో ఉన్న ఐదు వికెట్లతో గెలుపునకు 148 పరుగులు చేయాల్సిన స్థితిలో గురువారం మైదానంలో దిగిన సౌరాష్ట్ర కాసేపు ప్రతిఘటించింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ విశ్వరాజ్ జడేజా (137 బంతుల్లో 52; 6 ఫోర్లు), కమలేశ్ మక్వానా (45 బంతుల్లో 17; 2 ఫోర్లు) ఆశలు రేపారు. దాదాపు 15 ఓవర్లు క్రీజులో నిలిచిన వీరు ఆరో వికెట్‌కు 33 పరుగులు జత చేశారు. కానీ, మక్వానాను ఔట్ చేసిన సర్వతే ఈ జోడీని విడగొట్టాడు. ఆ వెంటనే ప్రేరక్ మన్కడ్ (2)ను అక్షయ్ పెవిలియన్ పంపాడు. జట్టు స్కోరు 103 వద్ద విశ్వరాజ్‌ను సర్వతే ఎల్బీడబ్ల్యూ చేయడంతో సౌరాష్ట్ర ఓటమి ఖాయమైంది. ధర్మేంద్ర జడేజా (17), కెప్టెన్ జైదేవ్ ఉనాద్కట్ (7) వికెట్లను ఆరు పరుగుల తేడాతో పడగొట్టి విదర్భ జయకేతనం ఎగురవేసింది.
సంక్షిప్త స్కోర్లు
విదర్భ తొలి ఇన్నింగ్స్: 312 (కర్నెవార్ 73; అక్షయ్ వాద్కర్ 45; ఉనాద్కట్ 3/54, సకారియా 2/44); రెండో ఇన్నింగ్స్: 200 (సర్వతే 49, మోహిత్ కాలే 38; ధర్మేంద్ర జడేజా 6/96, మక్వానా 2/51).
సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్: 307 (స్నెల్ పటేల్ 102, ఉనాద్కట్ 46; సర్వతే 5/98, వాఖరే 4/80) రెండో ఇన్నింగ్స్: 127 (విశ్వరాజ్ జడేజా 52; సర్వతే 6/59, వాఖరే 3/37).
►6 రంజీ ట్రోఫీని వరుసగా రెండో ఏడాది గెలుచుకున్న ఆరో జట్టుగా విదర్భ గుర్తింపు పొందింది. గతంలో ముంబై, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, రాజస్థాన్ ఈ ఘనత సాధించాయి. వీటిలో ముంబై ఆరు సార్లు వరుసగా రెండేసి, ఒక సారి వరుసగా మూడు టైటిల్స్ సాధించడంతో పాటు 1958–59 సీజ¯Œ నుంచి 1972–73 వరకు వరుసగా 15 సార్లు నెగ్గడం విశేషం. కర్ణాటక రెండు సార్లు వరుసగా రెండు టైటిల్స్ గెలుచుకుంది.
► 10 వసీం జాఫర్ 10వ రంజీ టైటిల్ విజయంలో భాగమయ్యాడు. ముంబై తరఫున 8 సార్లు, విదర్భ తరఫున 2 సార్లు అతను గెలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment