కోహ్లి ది అన్‌టోల్డ్‌ స్టోరీ.. | Virat Kohli Birthday special story | Sakshi
Sakshi News home page

కోహ్లి ది అన్‌టోల్డ్‌ స్టోరీ..

Published Sun, Nov 5 2017 5:57 AM | Last Updated on Sun, Nov 5 2017 10:32 AM

Virat Kohli Birthday special story - Sakshi

సమకాలీన క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌ అంతా ఒకవైపు.. విరాట్‌ కోహ్లి ఒక్కడే ఒక వైపు.. కొన్నెళ్ల క్రితం అతడి మాటలో మాత్రమే దూకుడెక్కువ అన్న వాళ్లకు బ్యాట్‌తోనే బదులిచ్చాడు. క్రీజులోకి వచ్చి ప్రత్యర్థులకు దడ పుట్టించాడు.. ఎంతలా అంటే  ‘మనం తప్పు  చేయడానికి వీల్లేదు జాగ్రత్త... క్రీజ్‌లో కోహ్లి ఉన్నాడు..! అని ప్రతి కెప్టెన్‌ అనేంతా..ఒకప్పుడు సచిన్‌.. ఇప్పుడు కోహ్లి అని అందరూ చెప్పుకునేంతా.. ఇరువై ఎనిమిదేళ్లకే అన్ని ఫార్మాట్లలో ఈ తరం చూసిన అత్యుత్తమ నాయకుడుగా అవతరించాడు. మైదానంలో తిరుగులేని శక్తిగా, భారత క్రికెట్‌ ముఖచిత్రంగా ఎదిగిన ఈ రథ సారథి 29వ ఏట అడుగెడుతున్న సందర్భంగా మరిన్ని విశేషాలు..

    కోహ్లి అనగానే తొలుత అందరికి తట్టేది.. నోటి దురుసైన ఆటగాడు.. ఓటమి సహించలేని కెప్టెన్‌.. కానీ  ఇదంతా ఒక వైపు నాణేం మాత్రమే. అతనికి క్రికెట్‌ పట్ల ఉన్న నిబద్ధత.. జట్టులో స్థానం కోసం అతను పడ్డ శ్రమ .. తండ్రి ఆశయం కోసం ఎంతటికైన తెగించిన సాహసి అనే.. ‘కోహ్లి అన్‌టోల్డ్‌ స్టోరీ’ మరో వైపు నాణేమని గ్రహించాల్సిందే.. చిన్న వయసులో పేరు.. డబ్బు అతన్ని అలా చేశాయి. కానీ ఒక ఆటగాడిగా ఓటమిని సహించలేకపోవడం.. దూకుడుగా ఉండటం తప్పేం కాదంటారు కోహ్లి అభిమానులు..

ఢిల్లీలో భారత్‌ టెస్టు మ్యాచ్‌ ఆడుతోంది. బౌండరీ లైన్‌ వద్ద మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఫీల్డింగ్‌. గీత అవతల ఉన్న ఓ 10 ఏళ్ల పిల్లాడు ఒక్కసారైనా తనవైపు చూడకపోతాడా అని ఆశతో చేయి ఊపుతూనే ఉన్నాడు. ఆ పిల్లాడి ఉత్సాహం గమనించిన సెహ్వాగ్‌ ఓ చిరు నవ్వు నవ్వాడు.

అంతే ఆ పిల్లాడు పట్టరాని సంతోషంలో మునిగిపోయాడు. ఆ పిల్లాడు కోహ్లినేనని 16 ఏళ్ల తర్వాత సెహ్వాగ్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాట.. ‘కోహ్లి బ్యాటింగ్‌ చేస్తుంటే కళ్లు పక్కకు తిప్పలేం, నా పిల్లలు నా బ్యాటింగ్‌ కంటే విరాట్‌ బ్యాటింగే ఇష్టపడతారు.’  కోహ్లి ఏ క్రికెటర్‌ పలకరింపు కోసం ఎదురు చూశాడో ఆ క్రికెటర్‌తో ఆడటమే కాకుండా అతని నుంచి ప్రశంసలు పొందాడు. ఇలా అతను ఆరాధ్య దైవంగా భావించిన.. ఒక్కసారైన చూడాలనుకున్న క్రికెటర్లందరితోను ఆడటమే కాక వారి మన్ననలు పొందాడు. 

♦ ఆ రాత్రి నుంచే.. కొత్త కోహ్లి
2006లో  ఢిల్లీ- కర్ణాటక రంజీ మ్యాచ్‌ ఆడుతున్న సమయంలో బ్రెయిన్‌స్ట్రోక్‌తో కోహ్లి తండ్రి ప్రేమ్‌ కోహ్లి చనిపోయాడన్న సమాచారం అందింది. కీలక మ్యాచ్‌లో 59 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఢిల్లీ జట్టు కష్టాల్లో ఉంది. అప్పటికే కోహ్లి ఓవర్‌నైట్‌ 40 స్కోరుతో నాటౌట్‌గా ఉన్నాడు. ఈ విషయాన్ని కోచ్‌ ముందు ప్రస్తావించగా అతను ఇంటికెళ్లమని సూచించాడు. అయినా అతడి భావోద్వేగాలు అదుపు తప్పలేదు. అప్పటికే అతని నరనరాల్లోకీ క్రికెట్‌ ఎక్కేసింది.

దానికంటే ఏదీ ఎక్కువ కాదనే నిర్ణయానికి వచ్చేశాడు. కాదు... తండ్రే అతడికా విషయాన్ని నూరిపోశాడు. అందుకే దుఃఖాన్ని దిగమింగుకొని బ్యాటింగ్‌ కొనసాగించాలనీ, శతకం చేసి తండ్రికి అంకితమివ్వాలనీ నిర్ణయించుకున్నాడు. కానీ తొంబై పరుగుల వద్ద అంపైర్‌ తప్పిదం వల్ల అవుటైన కోహ్లి, శతకం చేయకపోయినా ఆ స్ఫూర్తికి తండ్రి సంతోషించే ఉంటాడన్న నమ్మకంతో నేరుగా అంత్యక్రియలకు బయల్దేరాడు. ఆ రాత్రి నుంచీ తామంతా ఓ కొత్త కోహ్లిని చూశామని తెలిపింది విరాట్‌ తల్లి సరోజ్‌. కోహ్లి ఇన్నింగ్స్‌తో ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమి నుంచి గట్టెక్కింది.

♦ అండర్‌-19 ప్రపంచకప్‌తో తారాజువ్వలా..
2008 అండర్‌-19 ప్రపంచకప్‌కు జట్టుకు కెప్టెన్స్‌ వహించిన కోహ్లి ఓ కొత్త చాంపియన్‌గా నిలిచాడు. సిరీస్‌లో భారీ లక్ష్యాలను బ్యాటుతో అవలీలగా ఛేదిస్తూ, సందర్భానికి తగ్గట్లు బౌలర్లనూ, ఫీల్డర్లనూ మారుస్తూ ఆల్‌రౌండ్‌ ఆటగాడిగా అదరగొట్టాడు. భారత్‌ను అండర్‌-19 ప్రపంచకప్‌ విజేతగా నిలబెట్టాడు. దీంతో రాత్రికి రాత్రే భవిష్యత్తు తారగా ముద్ర వేసుకున్నాడు. ఆ వెంటనే ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ నుంచి పిలుపొచ్చింది.

ఆపైన శ్రీలంకతో సిరీస్‌కు సచిన్‌, సెహ్వాగ్‌ గాయాల కారణంగా దూరమవడంతో అనూహ్యంగా కోహ్లికి జట్టులో చేరే అవకాశం లభించింది. అలా ఊహ తెలిసినప్పట్నుంచీ భారత్‌కు ఆడాలని తండ్రితో కలిసి కోహ్లి కన్న కల పందొమ్మిదేళ్ల వయసులో నెరవేరింది. ఆ సిరీస్‌లో నాలుగో మ్యాచ్‌లో కోహ్లి అర్ధ శతకంతో టోర్నీ భారత్‌ సొంతమైంది. అక్కడితో తన రాత మారిపోయిందనుకున్న కోహ్లి ఆశ అంత సులువుగా తీరలేదు.

♦ విమర్శలు.. వివాదాలు..
ఎంతటి స్థాయి వ్యక్తికైనా జీవితంలో ఒడిదుడుకులు ఉండటం సహజమే. కోహ్లి విషయంలోను అదే జరిగింది. వన్డే క్రికెట్‌లో తన ప్రస్థానాన్ని బాగానే ప్రారంభించినా, తరవాతి సిరీస్‌కు సచిన్‌, సెహ్వాగ్‌ అందుబాటులోకి రావడంతో కోహ్లి స్థానం బెంచికే పరిమితమైంది. ఆ తరవాతి సిరీస్‌లో ఏకంగా అతడి చోటే గల్లంతయ్యింది. ఆపైన ఎవరైనా గాయాలపాలైన సందర్భంలో వచ్చిన అవకాశాల్ని రెండు చేతులా అందుకుంటూ, తనను తొలగించలేని పరిస్థితిని సెలెక్టర్లకు కల్పించాడు. ఇలా 2009లో భారత్‌లో శ్రీలంక పర్యటించినప్పుడు నాలుగో వన్డేకు గాయంతో యువరాజ్ దూరమయ్యాడు.

అతని స్థానంలో కోహ్లికి అవకాశం లభించింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అప్పటి సహచర ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌తో కలిసి సింగిల్స్‌ తీస్తూ అతన తన తొలి శతకాన్ని సాధించాడు. మూడో వికెట్‌కు వీరిద్దరూ 224 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే కోహ్లి ఆటకు ముగ్దుడైన గంభీర్‌ తనకు లభించిన మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారాన్ని కోహ్లికి ఇచ్చాడు.పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తూ జట్టులో శాశ్వత సభ్యుడిగా మారాడు. 

ఆపైన 2011లో వన్డే ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టులోనూ తనదైన ముద్ర వేశాడు. మూడేళ్ల వరకూ బాగానే నడిచింది. చిన్న వయసులోనే పేరూ డబ్బూ హోదా వచ్చేశాయి. వాటితో పాటు కాసింత దూకుడూ, నోటి దురుసు కూడా. క్రమంగా మైదానంలో ఆవేశం పెరిగింది. చీటికీ మాటికీ కోపం తెచ్చుకోవడం, నోరు జారడం మామూలైంది. దీంతో ప్రత్యర్థులతో పాటు విదేశీ అభిమానులకూ కోహ్లి అలుసైపోయాడు. వైఫల్యాలు మొదలయ్యాయి. ఫలితంగా ఇంగ్లండ్‌తో సిరీస్‌లో జట్టుకు దూరమయ్యాడు. ఆపైన 2012 ఐపీఎల్‌లోనూ చెత్త ప్రదర్శనతో విమర్శలతో పాటు అభిమానుల వెక్కిరింతలకు గురయ్యాడు. ఆటతో పాటు మాటతీరూ తీసుకొచ్చిన ఫలితమది.

♦ కోహ్లిలో అంతర్మథనం..
భారత జట్టులో స్థానం కోల్పోవడం పట్ల కోహ్లిలో అంతర్మథనం మొదలైంది. అద్దం ముందు నిల్చోని తనని తాను చూసుకున్నాడు. తన తప్పులు ఏమిటో గ్రహించాడు. అంతర్జాతీయ క్రికెటర్లకు తనుకు ఉన్న తేడా ఏమిటో గమనించాడు. ఫిట్‌నెస్‌ ఉంటేనే క్రికెట్‌లో రాణించగలమని గ్రహించాడు.  వెంటనే తన రూపాన్ని మార్చాలని బరువు తగ్గి ఫిట్‌నెస్‌ సాధించాడు.

మాటలోని దూకుడు ఆటపై మలిచి పరుగుల ప్రవాహాన్ని సృష్టించాడు. ప్రత్యర్థుల కవ్వింపులకు, విమర్శకులకు బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కోహ్లి మళ్లీ పుట్టాడు. అవును క్రికెట్‌ ప్రపంచంలో ఓ నవ శకానికి నాందీ పలికాడు. ఆ తరువాత అతడిని తట్టుకోవడం ఎవరి తరం కాలేదు. భారీ లక్ష్యాలను అవలీలగా ఛేదించడం అలవాటైపోయింది. మైదానంలో తనకసలు పోటీనే లేదన్నట్లు దూసుకెళ్తున్నాడు.

♦ కెప్టెన్‌గా..తొలి ఓటమి
ఓటమి గెలుపుకు తొలి మెట్టు అన్నట్లు కోహ్లి సారథ్యం వహించిన తొలి మ్యాచ్‌ భారత్‌ ఓడిపోయింది. ఈ సిరీస్‌ అనంతరం ఇప్పటి వరకు కోహ్లి కెప్టెన్సీలో భారత్‌ వరుస విజయాలందుకుంది. 2014 ఆస్ట్రేలియా సిరీస్‌లో ధోని గాయపడటంతో తొలిసారి అడిలైడ్‌ టెస్టు మ్యాచ్‌కు నాయకత్వం వహించాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌గా సెంచరీ చేసి రికార్డు నెలకొల్పాడు. కానీ భారత్‌ 48 పరుగుల తేడాతో ఈ మ్యాచ్‌  ఓడిపోయింది. మెల్‌బోర్న్‌ బాక్సింగ్‌ టెస్టు అనంతరం ధోని అనూహ్యంగా టెస్ట్‌ కెరీర్‌కు విడ్కోలు పలకడంతో విరాట్‌  పూర్తి స్థాయి కెప్టెన్‌ అయ్యాడు.

 కోహ్లి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన అనంతరం భారత్‌ టెస్టుల్లో 2015లో శ్రీలంక, 2016లో సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ సిరీస్‌లను వరుసగా గెలిచింది.  ఇక లిమిటెడ్‌ ఓవర్స్‌ మ్యాచ్‌లకు కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోని తప్పుకోవడంతో కోహ్లి మూడు ఫార్మాట్లకు పూర్తి స్థాయి నాయకుడయ్యాడు. ధోని సలహాలతో గెలవాలనే ఆవేశాన్ని అందరిలో రగిలిస్తూ.. 2019 ప్రపంచకప్‌ లక్ష్యంగా.. జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. ఇక కోహ్లి రికార్డుల గురించి ప్రస్తావిస్తే ఓ పుస్తకాన్నే ప్రచురించాల్సిఉంటుంది. ఆడే ప్రతి మ్యాచ్‌లో ఓ రికార్డును సొంతం చేసుకుంటున్నాడు.. 

♦ మచ్చుకు కొన్ని..రికార్డులు.. 

  • భారత్‌ తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌ కోహ్లి... 52 బంతుల్లో. 
  • వన్డేల్లో వేగంగా వెయ్యి, నాలుగువేలు, ఐదు వేలు, ఆరు వేలు, ఏడు వేలు, ఎనిమిది, తొమ్మిది వేల పరుగుల మైలురాళ్లను దాటిన భారత ఆటగాడూ కోహ్లినే. 
  • ప్రపంచంలో అత్యంత వేగంగా పాతిక శతకాలు బాదిన రికార్డూ అతడిదే. వన్డేల్లో సచిన్‌(49) తర్వాత అత్యధిక శతకాలు సాధించిన రెండో ఆటగాడు కోహ్లినే(32) 
  • టెస్టుల్లో కెప్టెన్‌గా తొలి మూడు ఇన్నింగ్స్‌లో సెంచరీ కొట్టిన ఒకేఒక్కడు. టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌
  • 2013లో అర్జున అవార్డు, 2017లో పద్మశ్రీ అవార్డులు కోహ్లిని వరించాయి.

♦ కెరీర్‌ ఇలానే కొనసాగితే రిటైరయ్యే నాటికి ఏ రికార్డులూ మిగలవనీ, ఏ ఆటగాడూ దరిదాపుల్లో నిలవడనీ చెప్పే అతని అభిమానుల వాదనకు తిరుగులేదు!

⇒ కోహ్లి ఫోటోల కోసం ఈ స్లైడ్‌ షోను క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/10

తల్లి సరోజ్‌, తండ్రి ప్రేమ్‌ కోహ్లితో విరాట్‌ కోహ్లి..

2
2/10

రాహుల్‌ ద్రావిడ్‌తో చిన్నప్పటి కోహ్లి

3
3/10

అండర్‌-19 ప్రపంచకప్‌తో విరాట్‌

4
4/10

తొలి శతకంతో సహచర ఆటగాడు గంభీర్‌కు దక్కిన మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ను అందుకుంటున్న కోహ్లి

5
5/10

విరాట్‌ వన్డే, టెస్టు, టీ20 తొలి సెంచరీ ఫోజులు..

6
6/10

ప్రపంచకప్‌ విజయానంతరం తన ఆరధ్య దైవం సచిన్ ను భుజాలపై మోస్తూ..

7
7/10

సహచర ఆటగాడు జడేజా అందుకున్న మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ బైక్‌పై చక్కర్లు కొడుతూ..

8
8/10

అనాథ బాలలతో కోహ్లి

9
9/10

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీద అర్జున అవార్డు, పద్మశ్రీ అందుకుంటున్న విరాట్‌

10
10/10

15 ఏళ్ల వయసులో నెహ్రా చేత బ్యాట్‌ అందుకోని.. ప్రస్తుతం కెప్టెన్‌గా నెహ్రాకు రిటైర్మెంట్‌ జ్ఞాపికను అందజేసిన విరాట్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement