విరాట్ మరో రికార్డు బ్రేక్ చేశాడు..
పల్లెకెలె: ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి.. లంకేయులతో టెస్టు సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడం ద్వారా మరో ఘనతను సాధించాడు. శ్రీలంకతో చివరిదైన మూడో టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన తరువాత కోహ్లి ఖాతాలో మరో రికార్డు చేరింది. విదేశాల్లో అత్యధిక టెస్టు విజయాలు సాధించిన రెండో భారత క్రికెట్ కెప్టెన్ గా కోహ్లి నిలిచాడు. శ్రీలంకపై విజయం భారత కెప్టెన్ గా కోహ్లికి ఏడో విదేశీ టెస్టు విజయం. అయితే ఇక్కడ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని కోహ్లి అధిగమించాడు.
గతంలో ధోని ఆరు విదేశీ టెస్టు విజయాల్ని సాధించగా, ఆ రికార్డును విరాట్ సవరించాడు. కాగా, విదేశాల్లో అత్యధిక టెస్టు విజయాలు సాధించిన భారత కెప్టెన్ ఘనత సౌరవ్ గంగూలీ పేరిట ఉంది. సౌరవ్ గంగూలీ తన కెరీర్ లో 11 విదేశీ టెస్టు విజయాల్ని సాధించాడు. భారత కెప్టెన్ గా గంగూలీ 49 టెస్టులకు సారథ్యం వహించగా, ధోని 60 టెస్టులకు కెప్టెన్ గా చేశాడు. కోహ్లి ఇప్పటివరకూ 29 టెస్టులకు సారథిగా చేశాడు. లంకేయులతో మూడో టెస్టులో భారత ఇన్నింగ్స్ 171 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా విదేశాల్లో మూడు అంతకంటే ఎక్కువ టెస్టుల సిరీస్ ను తొలిసారి గెలిచిన భారత జట్టుగా విరాట్ అండ్ గ్యాంగ్ నిలిచింది.