
విరాట్ కోహ్లి, డ్వేన్ బ్రావో (పాత ఫొటోలు)
ముంబై : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ప్రశంసల జల్లు కురిపించాడు. ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సారథిగా వ్యవహరిస్తున్న కోహ్లిని ఫుట్‌బాల్ లెజండ్ క్రిస్టియనో రొనాల్డోతో పోల్చాడు. క్రికెట్ ప్రపంచంలో గల క్రిస్టియనో రొనాల్డో.. కోహ్లి అంటూ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ సీజన్-11లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్రావో.. జట్టు ప్రమోషనల్ ఈవెంట్‌లో భాగంగా మీడియాతో మాట్లాడాడు.
‘కోహ్లి ప్రతిభావంతుడు. ఆట పట్ల అతడికున్న అంకితభావం అమోఘం. ఒక ఆటగాడిగా నేను అతని ఆటను ఆస్వాదిస్తాను. హ్యాట్సాఫ్ టూ విరాట్ కోహ్లి.. విజయాలు సాధించేందుకు నువ్వు అర్హుడివి’ అంటూ ప్రశంసలు కురిపించాడు. తన తమ్ముడు డారెన్‌తో పాటు కోహ్లి అండర్- 19 క్రికెట్ ఆడాడని, ఆ సమయంలో తన తమ్ముడికి ఆటలోని మెలకువలు నేర్పాల్సిందిగా, సూచనలు ఇవ్వాల్సిందిగా కోహ్లిని కోరానని గుర్తు చేసుకున్నాడు.