'ధోని నుంచి చాలా నేర్చుకున్నాడు'
రాజ్కోట్: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై సహచర ఆటగాడు అజింక్యా రహానే ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం ఉన్న భారత క్రికెట్ జట్టుకు అసలు సిసలైన సారథి కోహ్లినేనని కొనియాడాడు. భారత జట్టును కోహ్లి ముందుండి నడిపించే తీరు అత్యంత అద్భుతంగా ఉంటుందన్నాడు.
'భారత క్రికెట్ జట్టుకు దొరికిన అరుదైన ఆటగాడు కోహ్లి. అతని కెప్టెన్సీ స్కిల్స్ అమోఘం. ప్రస్తుతం మా టెస్టు జట్టుకు అతనే తగిన నాయకుడు. ఎవరూ ఏమి చెప్పినా వారి సూచనల్ని కోహ్లి చాలా ఓపికతో వింటాడు. కోహ్లికి ఈ తరహా లక్షణాలు రావడానికి పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనినే కారణం. ధోని నుంచి కోహ్లి చాలా నేర్చుకున్నాడు' అని రహానే పేర్కొన్నాడు.
మరోవైపు ఇటీవల కాలంలో తాము మంచి క్రికెట్ ఆడుతున్నామని, అదే సమయంలో ఇంగ్లండ్తో సిరీస్ ముగిసే వరకూ ఆటగాళ్లు ఫిట్ నెస్ ను కాపాడుకోవడం కూడా అత్యంత ముఖ్యమన్నాడు.ఎనిమిదేళ్ల తరువాత భారత్ జట్టు డీఆర్ఎస్తో మ్యాచ్లు ఆడబోతుందని, ఆ నిర్ణయాలపై ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై జట్టుకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయన్నాడు. సరికొత్త టెక్నాలజీతో మన ముందుకు రాబోతున్న డీఆర్ఎస్ ఎలా పని చేస్తుందనే దానిపై మాట్లాడటానికి కొంత సమయం కచ్చితంగా అవసరమని రహానే అభిప్రాయపడ్డాడు.