విరాట్ పై గిల్ క్రిస్ట్ ప్రశంసలు
మెల్బోర్న్:భారత క్రికెట్ జట్టు టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఆటగాడు ఆడమ్ గిల్క్రిస్ట్ ప్రశంసలు కురిపించాడు. గత కొంతకాలంగా విరాట్ బ్యాటింగ్ అమోఘంగా ఉందని కొనియాడాడు. విరాట్ ఆటగాడిగానే కాదు.. కెప్టెన్గా కూడా సఫలమయ్యాడన్నాడు.
'విరాట్ ఆట తీరు అసాధారణం. నా దృష్టిలో విరాట్ లో నాయకత్వ లక్షణాలు కూడా అమోఘం. విరాట్ ఎప్పుడైతే టెస్టు పగ్గాలు తీసుకున్నాడో అప్పుడే భారత క్రికెట్ జట్టులో దూకుడు పెంచాడు. మూడు ఫార్మెట్లలో విరాట్ ముద్ర స్పష్టంగా కనబడుతోంది. భారత జట్టు విజయాల్లో విరాట్ పాత్ర ఎనలేనిది ' అని గిల్ క్రిస్ట్ పేర్కొన్నాడు.
అయితే పరిమిత ఓవర్ల కెప్టెన్ గా విరాట్కు బాధ్యతలు అప్పజెప్పడానికి ఇదే సరైన సమయం అనుకుంటున్నారా?అని మీడియా అడిగిన ప్రశ్నకు మాత్రం గిల్ క్రిస్ట్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. ఆ విషయాన్ని తాను ఎలా చెప్పగలుగుతానని గిల్ క్రిస్ట్ ఎదురు ప్రశ్నించాడు. టీమిండియా ప్రస్తుత కెప్టెన్ గా ఉన్న ఎంఎస్ ధోని ఇంకా ఆడతానని ఇటీవల స్పష్టం చేసిన నేపథ్యంలో విరాట్ నాయకత్వ పగ్గాలపై తాను మాట్లాడటం ఎంతమాత్రం సరికాదన్నాడు.