హామిల్టన్: బాస్కెట్ బాల్ దిగ్గజం కోబీ బ్రియాంట్ మరణవార్త తనను షాక్‌కు గురిచేసిందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి విచారం వ్యక్తం చేశాడు. జీవితంలో ఎప్పుడు ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో ఊహించలేమని.. ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాలని చెప్పుకొచ్చాడు. కివీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన కోహ్లి.. కోబీకి నివాళులు అర్పించాడు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘‘ఇది చాలా బాధకరమైన విషయం. గుండె పగిలే వార్త. ప్రతీ ఒక్కరూ షాక్‌కు గురయ్యారు. రోజూ పొద్దునే ఎన్‌బీఏ మ్యాచ్‌లు చూడటంతో నా రోజు మొదలయ్యేది. అలాంటిది నాకు స్ఫూర్తిగా నిలిచిన కోబీ అకస్మాత్తుగా ఈ లోకం నుంచి వెళ్లిపోవడం బాధాకరం. జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో తెలియదు. కొన్నిసార్లు... మనం కేవలం ఆట గురించే ఆలోచిస్తాం. ఎలాంటి షాట్ ఆడాలి.. బంతిని ఎలా విసరాలి.. ఇలాంటి ఆలోచనలతో జీవించడాన్ని మరచిపోతాం. కోబీ మరణం నన్ను పూర్తిగా మార్చివేసింది. ఇప్పుడు నేను జీవితాన్ని కొత్తగా చూడటం మొదలుపెట్టాను. దాన్ని ప్రశంసిస్తున్నాను. జీవితాన్ని.. ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాలి. రోజులో ఏం చేస్తున్నామనేది ముఖ్యం కాదు... జీవించి ఉండటం కొన్నిసార్లు అతి ముఖ్యమైనదిగా అనిపిస్తుంది’’ అని కోహ్లి వేదాంత ధోరణిలో చెప్పుకొచ్చాడు.(చదవండి : టీమిండియా సూపర్ విక్టరీ: నెవర్ బిఫోర్... 5-0)
కాగా ‘బ్లాక్ మాంబా’గా సుపరిచితమైన బాస్కెట్ బాల్ లెజెండ్ కోబీ బ్రయాంట్, కూతురు జియానా(13) సహా మరో ఏడుగురు హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం విదితమే. గత ఆదివారం కాలిఫోర్నియా సమీపంలోని క్యాలాబసస్ వద్ద జరిగిన ఈ దుర్ఘటన యావత్ క్రీడా ప్రపంచాన్ని దుఃఖ సాగరంలో ముంచివేసింది.(మాటలు రావడం లేదు: కోబీ భార్య భావోద్వేగం)
Comments
Please login to add a commentAdd a comment