మరో రికార్డుకు చేరువలో కోహ్లి | Virat Kohli Thirty Seven Runs Away From Huge World Record | Sakshi
Sakshi News home page

మరో రికార్డుకు చేరువలో కోహ్లి

Jun 26 2019 3:05 PM | Updated on Jun 26 2019 3:11 PM

Virat Kohli  Thirty Seven Runs Away From Huge World Record - Sakshi

న్యూఢిల్లీ : భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌కోహ్లి మరో రికార్డు తన ఖాతాలో వేసుకోనున్నాడు. ఇప్పటికే ఈ ప్రపంచ కప్‌ ద్వారా వన్డేల్లో అత్యంత వేగంగా 11వేల పరుగుల మైలురాయిని చేరిన కోహ్లి మరో రికార్డుకు సిద్ధమవుతున్నాడు. అంతర్జాతీయంగా టెస్ట్‌, వన్డే, టీ 20ల్లో కలిపి ఇప్పటివరకు 19,963 పరుగులు పూర్తి చేసిన విరాట్‌ మరో 37 పరుగులు చేస్తే అత్యంత వేగంగా 20వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు. గురువారం ఓల్డ్‌ ట్రాఫర్డ్‌ మైదానంలో వెస్టిండీస్‌తో జరగనున్న మ్యాచ్‌లో కోహ్లి ఈ రికార్డును అధిగమిస్తాడని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో కోహ్లి ఈ రికార్డును చేరుకుంటే, ఈ ఘనతను సాధించిన 12వ బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందుతాడు. అంతేగాక భారత్‌ నుంచి మొదటి రెండు స్థానాల్లో ఉన్న సచిన్‌ టెండూల్కర్‌(34,357), రాహుల్‌ ద్రవిడ్‌ల(24,208) తర్వాత 20వేల పరుగులు సాధించిన మూడో ఆటగానిగా కోహ్లి స్థానం సంపాదించనున్నాడు. అంతర్జాతీయంగా 20వేల పరుగులు సాధించడానికి సచిన్‌, లారాలకు 453 ఇన్నింగ్స్‌లు , రికీ పాంటింగ్‌కు 468 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఇప్పటివరకు 416 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లి తొందర్లోనే ఈ రికార్డును అధిగమించనున్నాడు. 

ఈ ప్రపంచకప్‌లో వరుస అర్థసెంచరీలతో మంచి ఫామ్‌లో ఉన్న విరాట్‌కు ఈ రికార్డును చేరుకోవడం పెద్ద కష్టమేం కాదు. కానీ వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో భీకరమైన పేస్‌తో చెలరేగుతున్న జాసన్‌ హోల్డర్‌, కాట్రిల్‌, కీమర్‌ రోచ్‌లను తట్టుకొని ఈ రికార్డును అధిగమిస్తాడో లేదో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement