విరాట్ కోహ్లీ.. ఓ ఆసక్తికర సీన్!
హైదరాబాద్: బంగ్లాదేశ్ తో జరుగుతున్న ఏకైక టెస్టులో తొలిరోజు ఆటలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ కెప్టెన్, కీపర్ ముష్ఫికర్ రహీమ్ చేసిన ఓ పనికి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి కాసేపు నవ్వు ఆగలేదు. నాన్ స్ట్రైకర్ విజయ్ కి విషయాన్ని చెప్పి మరీ నవ్వుకున్నాడు. స్డేడియంలో కాసేపు అందరికీ ఈ సీన్ వినోదాన్ని పంచింది. అసలే ఏమైందంటే.. సెంచరీ వీరుడు మురళీ విజయ్ 101 పరుగులు, విరాట్ కోహ్లీ 31 పరుగుల వద్ద ఉన్నారు. ఆ సమయంలో ఇండియా స్కోరు 223/2. బంగ్లా లెఫ్టార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ వేసిన ఇన్నింగ్స్ 62వ ఓవర్లో ఓ బంతిని కోహ్లీ డిఫెన్స్ చేశాడు.
సరిగ్గా ఆ బంతి కోహ్లీ బ్యాట్ కు మిడిల్ లో తగిలింది. అయితే దీన్ని కెప్టన్ కమ్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ అంచనా వేయడంలో పొరపాటు చేశాడు. బంతి కోహ్లీ ప్యాడ్ కు తగిలిందా అని షార్ట్ లెగ్ ఫీల్డర్ తో చర్చించిన ముష్ఫికర్ వెంటనే అంపైర్ ను ఎల్బీడబ్ల్యూ కోసం రివ్యూ కోరాడు. దీంతో కోహ్లీకి పట్టరాని సంతోషం వేసింది. బంగ్లా ఓ రివ్యూను ఇంత సులువుగా కోల్పోతుందన్న విషయం తెలిసిన కోహ్లీ, నాన్ స్ట్రైకర్ విజయ్ తో కలిసి బంతి, బ్యాట్ కు ఎక్కడ తగిలిందో చెప్పి రివ్యూ నిర్ణయం వెలువడే వరకు నవ్వుతూ కనిపించాడు. అనంతరం విజయ్ (108) ఔట్ కాగా, కోహ్లీ మాత్రం తొలిరోజు ఆట నిలిపివేసే సమయానికి అజేయ శతకం(111, 141 బంతుల్లో 12 ఫోర్లు)తో, రహానే 45 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. తొలిరోజు భారత్ 90 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది.