
జట్టు గౌరవం కాపాడు...
విరాట్ కోహ్లికి బీసీసీఐ మందలింపు
పెర్త్: జర్నలిస్టుతో గొడవ పెట్టుకున్న స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి ఉదంతంపై బీసీసీఐ స్పందిం చింది. ఇలాంటి విషయాల్లో తలదూర్చకుండా జట్టు గౌరవాన్ని కాపాడాలని విరాట్‌ను మందలించింది. హిందుస్థాన్ టైమ్స్ (హెచ్‌టీ) విలేఖరిని కోహ్లి దుర్భాషలాడడంతో అతడు ఐసీసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో వివాదానికి చెక్ పెట్టేందుకు బోర్డు రంగంలోకి దిగింది.
‘ఎల్లవేళలా జట్టు గౌరవాన్ని కాపాడేలా ప్రవర్తించాలని వివాదానికి కేంద్ర బిందువైన క్రికెటర్‌కు చెప్పాం. భవిష్యత్‌లోనూ ఇలాంటి ఘటనలు జరుగకుండా చూడాలని సూచించాం’ అని కోహ్లి పేరు ప్రస్తావన లేకుండానే బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంతటిలో ఈ అంశాన్ని వదిలేసి ప్రపంచకప్‌లో భారత్ ప్రస్థానంపై దృష్టి పెట్టాల్సిందిగా మీడియాకు విజ్ఞప్తి చేశారు. అటు హెచ్‌టీ కూడా ఈ గొడవను ఇక్కడితో ముగిద్దామని నిర్ణయించుకుంది.