భేష్.. సెహ్వాగ్ ట్వీట్!
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ లో తొలి పతకం సాధించిన సాక్షి మాలిక్ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. రియోలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన సాక్షి మాలిక్ ను ప్రశంసిస్తూ టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పెట్టిన ట్వీట్ అందరి మన్ననలు అందుకుంది. ఆడపిల్లల పట్ల వివక్ష వద్దన్న సందేశంతో వీరూ ట్వీట్ పెట్టాడు.
'ఆడ పిల్లలను పురిట్లోనే చంపకుండా ఉంటే ఏం జరుగుతుందో సాక్షి మాలిక్ గుర్తు చేసింది. క్రీడల్లో మనదేశానికి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు మన బాలికలు వెళ్లి, మనదేశ గౌరవం కాపాడార'ని సెహ్వాగ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. రియోలో పతకం సాధించడంతో సాక్షి మాలిక్ గురించి ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుతోందని అన్నాడు. బాలికలు ఎదుర్కొంటున్న కష్టాల గురించి ఎవరు మాట్లాడకపోవడం శోచనీయమని పేర్కొన్నాడు.
సెహ్వాగ్ అభిప్రాయంతో అందరూ ఏకీభవించారు. సాక్షి మాలిక్ సొంత రాష్ట్రమైన హర్యానాలో భ్రూణహత్యలు ఎక్కువగా జరుగుతున్నట్టు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. హర్యానాలో బాలబాలికల నిష్పత్తి ఆందోళనకర స్థాయిలో ఉంది. అక్కడ ప్రతి 1000 మంది బాలురకు 873 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆడపిల్లలపై వివక్ష చూపొద్దని సెహ్వాగ్ విజ్ఞప్తి చేశాడు.
#SakshiMalik is a reminder of what cn happn if u don't kill a girl child.When d going gets tough,its our girls who get going &save our pride
— Virender Sehwag (@virendersehwag) 18 August 2016