
కరాచీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రాబోయే కాలంలో అన్ని బ్యాటింగ్ రికార్డులను తిరగరాస్తాడని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ అభిప్రాయపడ్డారు.‘ ప్రస్తుత తరంలో కోహ్లి అత్యుత్తమ బ్యాట్స్‌మన్. ఇలాగే ఫిట్‌నెస్ కాపాడకుంటూ.. ఆటను ఆస్వాదిస్తూ.. నైపుణ్య స్థాయిని పెంచుకుంటే ఇది సాధ్యమవుతుందని’ కోహ్లికి సలహా ఇచ్చాడు.
గతేడాది ఆయన పాక్ కోచ్ పదవికి రాజీమానా చేసిన విషయం తెలిసిందే. తాను క్రికెట్ ఆడిన రోజుల్లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ గురించి మాట్లాడుతూ.. అప్పటికీ ఇప్పటికీ ఆటలో చాలా మార్పులొచ్చాయన్నారు. ప్రస్తుతం తరంలో విరాట్ కోహ్లీకి అత్యధిక రేటింగ్ ఇచ్చారు.
సచిన్ టెండూల్కర్, బ్రియన్ లారాల్లో సచిన్ అత్యుత్తమమని తెలిపాడు. ‘నేను సచిన్‌తో ఎక్కువ క్రికెట్ ఆడాను. అతడు మా జట్టుపైనే అరంగేట్రం చేశాడు. చాలా ఏళ్లుగా ఆయన ప్రొఫెషనల్‌గా ఎదగడం చూశాను. ఆయనలా నిబద్ధతతో ఉన్న ఆటగాడిని ఇప్పటి వరకు చూడలేదు. నేను బౌలింగ్ వేసిన వారిలో సచిన్ అత్యుత్తమం. అతడికి బౌలింగ్ వేయడం ఓ సవాల్‌గా ఉండేది. లారా మాత్రం సహజ సిద్ధ క్రికెటర్. తనదైన రోజున చెలరేగేవాడు’ అని యూనిస్ చెప్పుకొచ్చాడు. తాను కోచ్‌గా ఉన్నప్పుడు క్రమశిక్షణకు పెద్దపీట వేశానని ఎంత ప్రతిభ ఉన్నా సరే క్రమశిక్షణ లేకపోతే వృథా అని పేర్కొన్నాడు.