షమీ సత్తా చూపిస్తాడా?
► వార్మప్‌లో ఆకట్టుకున్న పేసర్
► బౌన్సర్లు, యార్కర్లతో దూకుడు
► పూర్తి ఫిట్‌గా ఉంటే తుది జట్టులోకి
సాక్షి క్రీడావిభాగం మొహమ్మద్ షమీ భారత జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడి దాదాపు సంవత్సరం అయింది. ముందుగా మోకాలి గాయంతో జట్టుకు దూరమైన అతను మెరుగైన తర్వాత రెండేసి దేశవాళీ వన్డే, టి20 మ్యాచ్‌లు ఆడి ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడు. దాంతో ఆసీస్ పర్యటనకు వెళ్లాడు. అక్కడ మైదానంలోకి దిగనే లేదు, కండరాల గాయంతో మళ్లీ అవుట్. పూర్తి ఫిట్‌గా లేకపోయినా టి20 ప్రపంచకప్‌లోగా కోలుకుంటాడనే నమ్మకంతో సెలక్టర్లు అతడిని జట్టులోకి ఎంపిక చేశారు.
కెప్టెన్ ధోని గట్టిగా మద్దతు పలకడం కూడా అందుకు కారణం. ఒక రకమైన జూదంగా అందరూ అభివర్ణించినా ధోని, షమీని కోరుకున్నాడు. కొత్త బంతితో ఆరంభంలో వికెట్, చివరి ఓవర్లలో బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో అతని నైపుణ్యంపై కెప్టెన్‌కు అపార నమ్మకం ఉంది. బౌన్సర్లు, యార్కర్లతో కెప్టెన్ తనపై నమ్మకం ఉం చిన ప్రతీసారి షమీ దానిని నిలబెట్టుకున్నాడు. తుది జట్టులో మార్పు లేకుండా వరుస విజయాలతో టీ మిండియా దూసుకుపోతున్నా... షమీ ఫిట్‌గా ఉంటే నెహ్రాను పక్కన పెడతామని ధోని బహిరంగంగానే వ్యాఖ్యానించడం విశేషం. మరి టి20 వరల్డ్ కప్‌లో అతను ఏ మాత్రం ప్రభావం చూపించగలడు, తొలి మ్యాచ్‌కు 100 శాతం పూర్తి ఫిట్‌గా ఉండగలడా!
కొనసాగిన ప్రాక్టీస్...
ఫిట్‌నెస్‌ను పరీక్షించుకునే క్రమంలో ఇటీవల షమీ తీవ్రంగా సాధన చేశాడు. బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో భారత మహిళల క్రికెట్ జట్టుకు అతను బౌలింగ్ చేశాడు. ఇతర పురుష జట్లు ఆడిన మ్యాచ్‌లలో కూడా అతను పాల్గొన్నాడు. అందులో ప్రధానంగా ఆరంభ ఓవర్లలో బౌలింగ్ చేయడం, డెత్ ఓవర్లలో పరుగులు నిరోధించడం లేదా చిన్న లక్ష్యాన్ని కాపాడుకునే సమయంలో ప్రధాన పేసర్‌గా పాత్ర... ఇలాంటి పరిస్థితులు సృష్టించుకొని మరీ ఆయా మ్యాచ్‌లలో బౌలింగ్ చేశాడు.
ఈ ప్రయత్నంలో మళ్లీ గాయాలకు లోను కాకుండా చాలా జాగ్రత్త పడాల్సి వచ్చింది. షమీ బౌలింగ్‌పై ఎవరికీ సందేహాలు లేవు. వరల్డ్ కప్ సమయానికి ఫిట్ కావడమే అతనికి కీలకంగా మారింది. ఆ ప్రయత్నంలో ఇప్పుడతడు దాదాపు పూర్తి ఫిట్‌గా మారాడు.
ఆకట్టుకున్న బౌలింగ్...
వెస్టిండీస్‌తో తొలి వార్మప్ మ్యాచ్‌లో షమీ మెరుగైన ప్రదర్శనే కనబర్చాడు. 4 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి 2 వికెట్లు అద్భుతం కాకపోవచ్చు కానీ ఏడాది కాలంగా ఫిట్‌నెస్ గాయాలతో బాధపడి పునరాగమనం చేసిన బౌలర్ నుంచి ఇది మంచి ప్రదర్శనే. ఈ మ్యాచ్‌లో ఆరంభంనుంచే అతను నిలకడగా బౌన్సర్లు, యార్కర్లు విసిరాడు. బౌలింగ్ చేస్తున్నంతసేపు అతను ఏ దశలోనూ ఇబ్బందికి లోను కాలేదు. చక్కటి రనప్‌తో పాటు ఆకట్టుకునే యాక్షన్‌తో మంచి లయ కనబర్చాడు.
షమీ తమ జట్టు ప్రధాన బౌలర్ అని, సహజంగానే అతనిపై ఎన్నో అంచనాలు ఉన్నాయని సహచరుడు రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. ‘గాయాల నుంచి కోలుకొని, ఇంత కాలం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చి రాణించడం అంత సులువు కాదు. బౌలర్లకైతే మరీ కష్టం. కానీ షమీ చాలా బాగా బౌలింగ్ చేశాడు. అతను అన్ని రకాల బంతులు వేశాడు. మళ్లీ భారత జట్టు తరఫున ఆడుతున్నానని పట్టుదల అతనిలో కనిపించింది. దీని కోసం అతను తీవ్రంగా శ్రమించిన తీరు అభినందనీయం’ అని రోహిత్ ప్రశంసించాడు. పటిష్ట ప్రత్యర్థి అయిన దక్షిణాఫ్రికాతో కూడా మొహమ్మద్ షమీ మెరుగైన ప్రదర్శన చేస్తే ఇక ప్రధాన టోర్నీలో అతను పునరాగమనం చేయడం ఖాయం.