
'ఇక టెస్టులపైనే దృష్టి పెట్టు'
కరాచీ:త్వరలో జింబాబ్వే తో జరిగే సిరీస్ లో భాగంగా వన్డే సిరీస్ లో స్థానం సంపాదించలేకపోయిన పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ యూనస్ ఖాన్ ప్రధానంగా టెస్టులపైనే దృష్టి పెడితే బాగుంటుందని మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ సూచించాడు. ఇక వన్డేలను పూర్తిగా వదిలి పెట్టి.. టెస్టులపై దృష్టిపెడితే యూనస్ కు మంచిదని అక్రమ్ తెలిపాడు. 2013వ సంవత్సరం మధ్య నుంచి యూనస్ ను సెలెక్టర్లు వన్డేల్లో ఎంపిక చేయడం లేదని.. అటువంటప్పుడు ఇంకా వన్డే జట్టలో స్థానంకోసం పాకులాడటం అనవరమన్నాడు.
వన్డేల్లో ఆడే సత్తా ఇంకా యూనస్ కు ఉన్నా.. సెలెక్టర్లు ఉండే భవిష్య ఆలోచనల దృష్ట్యా ఆ ఫార్మెట్ ను విడిచిపెడితే మంచిదన్నాడు. ఇటీవల జరిగిన ప్రతిష్టాత్మక వరల్డ్ కప్ కూడా సీనియర్ ఆటగాడు యూనస్ ఖాన్ ను ఎంపిక చేయలేదని.. అటువంటి పరిస్థితుల్లో ఇక వన్డేలకు దూరంగా ఉండి, టెస్టులపై దృష్టి నిలపాలన్నాడు. గత రెండు రోజుల క్రితం జింబాబ్వేతో వన్డే సిరీస్ కు తనను ఎంపిక చేయకపోవడం యూనస్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.