'అది అత్యుత్తమ ప్రదర్శన కాదు'
ముంబై: దక్షిణాఫ్రికాతో టీ20 మ్యాచ్ లో 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ జో రూట్. రూట్ కేవలం 44 బంతుల్లో 83 (6 ఫోర్లు; 4 సిక్సర్లు) బాది జట్టుకు విజయాన్ని అందించినా సంతృప్తిగా ఉన్నట్లు కనిపించడం లేదు. తమ జట్టు భారీ టార్గెట్ ఛేదించి మరీ విజయాన్ని అందుకున్నప్పటికీ అది ఇంగ్లండ్ అత్యుత్తమ ప్రదర్శన కాదని రూట్ అభిప్రాయపడ్డాడు. అయితే ఈ మ్యాచ్ ఫలితం మాత్రం తమ జట్టులో విశ్వాసాన్ని పెంచిందని జో రూట్ తెలిపాడు. టి20 ప్రపంచకప్ చరిత్రలో ఇదే అత్యధిక ఛేజింగ్ అయినప్పటికీ తమ అత్యుత్తమ ఆట బయటకు రావాల్సి ఉందని రూట్ పేర్కొటూ టోర్నమెంట్ కు మరింత జోష్ తీసుకొచ్చాడు.
బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ రాణించడం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నాడు. గ్రూప్ నుంచి తర్వాతి దశకు వెళ్లేందుకు తమ ఆటగాళ్లకు మరింత మంచి అవకాశం లభించిందని, మంచి ఆరంభం లభిస్తే ఎలాంటి మ్యాచ్ లో నైనా విజయాలు సాధించవచ్చని చెప్పాడు. అద్భుత ఆరంభం లభించడంతో మధ్య ఓవర్లలో సులువుగా బ్యాటింగ్ చేసేందుకు అవకాశం దొరికిందని, స్పిన్నర్లు గత కొంతకాలం నుంచి మెరుగైన ప్రదర్శన ఇస్తున్నారని చెప్పుకొచ్చాడు.