చేతులెత్తేసిన బీసీసీఐ!
న్యూఢిల్లీ:ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్కు రోజుల సమీపిస్తున్న తరుణంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) చేతులెత్తేసింది. లోధా కమిటీ సిఫారుసుల అమలుపై సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇరుకున పడ్డ బీసీసీఐ.. భారత్లో పర్యటించే ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఖర్చులు భరించలేమని తేల్చిచెప్పింది. దీనిలో భాగంగా హోటల్, ప్రయాణ ఖర్చులను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డే భరించాలని బీసీసీఐ లేఖలో కోరింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ అజయ్ షిర్కే.. ఈసీబీకి తాజాగా లేఖ రాశారు.
'సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్ర క్రికెట్ సంఘాలకు ఎటువంటి నిధులు మంజూరు చేయలేకపోతున్నాం. అందుచేత ఇరు బోర్డుల పరస్పర ఒప్పందంలో భాగమైన ఆర్థికపరమైన ఖర్చులను మీరే భరించాలి. ఇది నిజంగా బాధాకరం.ఇరు బోర్డుల మ్యూచువల్ అగ్రిమెంట్ను అమలు చేసే స్థితిలో ప్రస్తుతం బీసీసీఐ లేదు.ఆ ఖర్చులను ఈసీబీనే భరించాలి'అని షిర్కే కోరారు.
దీనిపై ఈసీబీ స్పందించింది.ఇప్పటికే ఇంగ్లండ్ జట్టు భారత్ లో ఉంది. సిరీస్ యథావిధిగానే జరుగుతుంది. అందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రస్తుత బీసీసీఐ నిర్ణయంతో సిరీస్ను రద్దు చేసుకునే ఆలోచనలేదు'అని ఈసీబీ ప్రతినిధి తెలియజేశారు.