జీతభత్యాల కోసం క్రికెటర్ల పడిగాపులు!
విశాఖ:తన సుదీర్ఘ పర్యటనలో భాగంగా దాదాపు 18 రోజుల క్రితం భారత్ లో అడుగుపెట్టిన ఇంగ్లండ్ జీతభత్యాల కోసం పడిగాపులు కాస్తోంది. ఆ క్రికెటర్ల రోజువారీ వేతనాలను అందించడంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) విఫలం కావడంతో అందుకోసం నిరీక్షణ తప్పడం లేదు. రోజువారీ వేతనంలో భాగంగా ప్రతీ ఇంగ్లండ్ క్రికెటర్కు రూ.4,200(50 పౌండ్లు)లను బీసీసీఐ ఇవ్వాల్సి ఉంది. లోధా కమిటీ సిఫారుసుల అమలుపై సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో బీసీసీఐ తన నిధులను మంజూరు చేసే అవకాశం లేకుండా పోయింది. దాంతో ఇంగ్లండ్ ఆర్ధిక కష్టాలు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం వారి వద్ద నున్న పరిమితమైన నగదుతో పాటు, క్రెడిట్ కార్డులను తమ అవసరాలకు వాడుతున్నారు.
ఇంగ్లండ్ పర్యటనకు వచ్చినప్పుడే ఆ జట్టు ప్రయాణపు ఖర్చులను, హోటల్ ఖర్చులను ఈసీబీ భరించాలంటూ బీసీసీఐ లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాము పూర్తిగా అచేతన స్థితిలో ఉన్నామని, అందుకు ఇంగ్లండ్ క్రికెటర్ల ఖర్చులను మీరే భరించాలంటూ లేఖలో పేర్కొంది. ఆ క్రమంలోనే క్రికెటర్ల అవసరాలకు బీసీసీఐ ఎటువంటి శ్రద్ధ కనబరచడం లేదు. మరొకవైపు భారత క్రికెటర్లకు, మ్యాచ్ అధికారుల ఖర్చులకు తగినంత డబ్బును సమకూర్చిన బీసీసీఐ.. ఇంగ్లండ్ క్రికెటర్ల వ్యవహారంలో మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేకపోవడం విమర్శలకు తావిస్తోంది. తమకు డబ్బు పరంగా ప్రధాన సమస్య లేకపోయినా.. కొద్ది మాత్రంలోనే నగదు ఉండటం ఆందోళన కల్గిస్తుందని ఇంగ్లండ్ జట్టులోని సభ్యుడు ఒకరు వ్యాఖ్యానించాడు.
ఇదిలా ఉంచితే, తొలి మూడు టెస్టుల నిర్వహణకు సుప్రీంకోర్టు నుంచి బీసీసీఐ అనుమతి పొందిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆయా రాష్ట్ర క్రికెట్ సంఘాలకు నిధులను మంజూరు చేసింది. మొత్తం మూడు టెస్టులకు కలిపి రూ. 58.6 లక్షలను బీసీసీఐ తమ ఖాతాలోంచి క్రికెట్ సంఘాలకు కేటాయించింది.