
'షమీపై భారీ అంచనాలు'
కోల్కతా: వరల్డ్ టీ 20లో భాగంగా టీమిండియా జట్టులో స్థానం దక్కించుకున్న టీమిండియా పేసర్ మొహ్మద్ షమీపై భారీ అంచనాలు పెట్టుకున్నట్లు రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. దాదాపు ఏడాది కాలంగా గాయాలతో సతమవుతున్న షమీ..గురువారం వెస్టిండీస్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో పాల్గొని ఆకట్టుకోవడం నిజంగానే భారత జట్టుకు శుభసూచకమన్నాడు. టీమిండియా జట్టులో మొహ్మద్ షమీ ఒక కీలక బౌలర్ అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. కచ్చితమైన ప్రణాళికలను అమలు చేయడంలో షమీ దిట్ట అని రోహిత్ కొనియాడాడు.
'మేము ఏదైతే ఆశిస్తామో దాన్ని షమీ నెరవేరుస్తూ ఉంటాడు. అటు బౌన్సర్లు, యార్కర్ల దగ్గర్నుంచి, స్లో బంతులను కూడా సమర్ధవంతంగా సంధిస్తాడు. టీమిండియా తరపున షమీ చివరిసారిగా ఆడేసరికి అతను మా ప్రధాన బౌలర్లలో ఒకడు. తొడ కండరాల గాయం నుంచి ఒక పేస్ బౌలర్ అంత తొందరగా కోలుకోవడం సులువు కాదు. అతని కష్టించే తత్వంతోనే వెస్టిండీస్ మ్యాచ్ లో షమీ ఆకట్టుకున్నాడు' అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
వెస్టిండీస్ జరిగిన వార్మమ్ మ్యాచ్లో షమీ 30 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. మోకాలి శస్త్రచికిత్సతో ఏడాది కాలంగా ఆటకు దూరంగా ఉన్న షమీ ఫిట్ నెస్ ను పరీక్షించే క్రమంలో అతన్ని విండీస్ తో ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆడించారు. ఆ మ్యాచ్ లో షమీ ఫర్వాలేదనిపించడంతో అతని స్థానంపై భరోసా ఏర్పడింది.