
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని జాతీయ క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరుస్తున్న వారిని తప్పకుండా ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో ని అశ్విన్ క్రికెట్ అకాడమీని ఆదివారం ఎమ్మెస్కే సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిభ ఉండి అవకాశాలు రాని మెరికల్లాంటి క్రికెటర్లను గుర్తించే దిశగా బీసీసీఐ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుందని చెప్పారు. రాష్ట్ర సంఘాలు, అకాడమీలు క్రీడాకారులకు తమ సత్తాను ప్రదర్శించే అవకాశాలను కల్పించాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల నుంచి అంతర్జాతీయ స్థాయిలో మరికొంత మంది క్రీడాకారులను తీసుకురావాల్సిన బాధ్యత ఉందన్నారు. అనంతరం పలువురు యువ క్రికెటర్లు, వారి తల్లి్లదండ్రులు, కోచ్ అశ్విన్ కుమార్ రాజు ఆయనను సన్మానించారు.