బ్రిస్బేన్: ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లి ఒక్కడే తమ టార్గెట్ కాదని అంటున్నాడు ఆసీస్ పేసర్ నాథన్ కౌల్టర్ నైల్. భారత జట్టులో చాలామంది అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్నారని, అందులో రోహిత్ శర్మ చాలా ప్రమాదకరమైన ఆటగాడిగా పేర్కొన్నాడు. అయితే రోహిత్‌ను బౌన్సర్లతో టార్గెట్ చేస్తామని కౌల్టర్ నైల్ హెచ్చరించాడు. తమ బౌలర్ల నుంచి వచ్చే బౌన్సర్లను కాచుకునేందుకు రోహిత్ సిద్ధంగా ఉండాలన్నాడు.
‘రోహిత్ ఒక అసాధారణ ఆటగాడు. ప్రపంచ క్రికెట్‌లో రోహిత్‌కు చక్కటి రికార్డు ఉంది. మేము ప్రధానంగా దృష్టి సారించాల్సిన భారత ఆటగాళ్లలో రోహిత్ ఒకడు. గతంలో రోహిత్‌ను కొత్త బంతులతో ఇబ్బంది పెట్టిన సందర్భాలున్నాయి. బంతిని పుల్ చేయడంలో రోహిత్ దిట్ట అనడంలో ఎటువంటి సందేహం లేదు. అదే బౌన్సర్లకు రోహిత్ దొరికిపోతాడు కూడా. బ్రిస్బేన్‌లో భారీ షాట్లు ఆడటం అంత ఈజీ కాదు. రోహిత్‌కు ఊరించే బంతులు సంధించి అతన్ని తొందరగా పెవిలియన్ పంపడానికి యత్నిస్తాం’ అని కౌల్టర్ నైల్ తెలిపాడు. బుధవారం జరుగునున్న తొలి టీ20తో ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ ఆరంభం కానుంది. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో మధ్యాహ్నం గం. 1.20 ని.లకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment