సెయింట్ లూసియా : దనాదన్ క్రికెట్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన వెస్టిండీస్ జట్టు ఇంగ్లండ్‌పై ఘోర ఓటమి చవిచూసింది. అసలు ఆడింది డిఫెండింగ్ చాంపియన్ విండీస్ జట్టేనా అని అనుమానం కలిగించేలా ఇంగ్లండ్‌పై అతి చెత్తగా ఆడారు. ఇంగ్లండ్ నిర్దేశించిన 184 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో కరీబియన్ జట్టు 45 పరుగులకే కుప్పకూలింది. దీంతో 137 పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూసి ఇంగ్లండ్‌కు టీ20 సిరీస్‌ను అప్పగించింది. టీ20 చరిత్రలోనే ఇది రెండో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. గతంలో పసికూన నెదర్లాండ్‌ను శ్రీలంక 39 పరుగులకే ఆలౌట్ చేసింది. అయితే టెస్టు జట్టు హోదాలేని నెదర్లాండ్ చేసిన చెత్త ప్రదర్శన కన్నా టీ20 డిఫెండింగ్ చాంపియన్ విండీస్ తాజా ప్రదర్శనే అతి ఘోరమైనదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్‌కు శుభారంభం అందలేదు. అయితే జోయ్ రూట్(55) బాధ్యాతయుతంగా ఆడాడు. చివర్లో బిల్లింగ్స్ (87; 47 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్కర్లు) బ్యాట్ ఝుళిపించడంతో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 182 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టు ఘోరంగా తడబడింది. క్రిస్ జోర్డాన్(4/6), విల్లే(2/18), రషీద్(2/12), ప్లంకెట్(2/8)లు కరేబియన్ పతనాన్ని శాసించారు. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి హెట్‌మేర్(10), బ్రాత్‌వైట్(10)లు తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. దీంతో 11.5 ఓవర్లలో 45 పరుగులకే ఆలౌటై విండీస్ ఘోర ఓటమి చవిచూసింది. ఫలితంగా ఇంగ్లండ్ సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య జరిగిన తొటి టీ20లో ఇంగ్లండ్ విజయం సాధించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment