సెమీస్కు చేరిన వెస్టిండీస్
ఢాకా: అండర్ -19 క్రికెట్ వరల్డ్కప్ లో వెస్టిండీస్ సెమీ ఫైనల్కు చేరింది. పాకిస్తాన్తో సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో విండీస్ ఐదు వికెట్ల తేడాతో గెలిచి సెమీస్లోకి ప్రవేశించింది. కెప్టెన్ హెట్మైర్(52), ఇమ్లాచ్(54)లు హాఫ్ సెంచరీలతో రాణించి విండీస్ను సెమీస్కు చేర్చారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 50.0 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 227 పరుగులు నమోదు చేసింది.
పాకిస్తాన్ జట్టులో ఉమైర్ మస్జూద్(113),సల్మాన్ ఫయజ్(58 నాటౌట్) మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన విండీస్ 40.0 ఓవర్లలో ఐదు వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుని సెమీస్ కు చేరింది. దీంతో సెమీ ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. తొలి సెమీ ఫైనల్ భారత్-శ్రీలంకల మధ్య , రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ వెస్టిండీస్ -బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగనున్నాయి.