
సిరీస్ కోల్పోయిన భారత్
మూలపాడు(విజయవాడ):మూడు ట్వంటీ 20ల సిరీస్లో భాగంగా వెస్టిండీస్ మహిళలతో జరిగిన రెండో మ్యాచ్లోనూ భారత మహిళలు పరాజయం చెంది సిరీస్ను కోల్పోయారు. విండీస్ విసిరిన 138 పరుగుల లక్ష్యానికి ఛేదించే క్రమంలో భారత మహిళలు 18.1 ఓవర్లలో 106 పరుగులకే పరిమితమై ఓటమి పాలయ్యారు. ఈ మ్యాచ్ లో 31 పరుగుల తేడాతో ఓటమి పాలైన భారత జట్టు ఇంకా మ్యాచ్ ఉండగానే సిరీస్ ను చేజార్చుకుంది.
భారత జట్టు లో హర్మన్ ప్రీత్ కౌర్(43),దీప్తి శర్మ(24) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఓటమి తప్పలేదు. 37 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత్ ను హర్మన్ ప్రీత్ ఆదుకునే ప్రయత్నం చేసే చేసింది. అయితే మిగతా క్రీడాకారిణులు నుంచి సహకారం లభించలేదు. ఎనిమిది మంది భారత క్రీడాకారిణులు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో భారత్ ఓటమి చెందింది.
విండీస్ బౌలర్లలో డాటిన్, అనీసాలు తలో మూడు వికెట్లు తీసి భారత జట్టును కట్టడి చేయగా, మాథ్యూస్ కు రెండు వికెట్లు లభించాయి.అంగ్విల్లెరియా,క్వింటైన్లకు చెరో వికెట్ దక్కింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. విండీస్ క్రీడాకారిణుల్లో స్టెఫానీ టేలర్(47), డాటిన్(35),అంగ్వెల్లిరియా(21), మాథ్యూస్(27)లు రాణించి ఆ జట్టుకు గౌరవప్రదమైన స్కోరును సాధించి పెట్టారు. తొలి ట్వంటీ 20 ఆరు వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.