మెస్సీ, ఎంబాపె
సోచి: కైలిన్ ఎంబాపె.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. అర్జెంటీనాతో మ్యాచ్ ముందు వరకు కైలిన్ ఎంబాపె గురించి బహుశా ఎవరికి తెలియకపోవచ్చు. కానీ, ఇప్పుడు ఈ ఫ్రాన్స్ ఫుట్‌బాలర్ గురించి నెటిజన్లు ఆసక్తిగా సెర్చ్ చేస్తున్నారు.
కారణం... 19 ఏళ్ల ఈ ఫ్రాన్స్ కుర్రాడు అర్జెంటీనాపై రెండు గోల్స్ చేసి.. మెస్సీ జట్టును ఇంటికి పంపించడంతో పాటు ఫ్రాన్స్‌ను వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి ఫ్రాన్స్‌కు విజయాన్ని కట్టబెట్టాడు.
చివరిసారిగా ఫ్రాన్స్ 1998లో ప్రపంచకప్ గెలిచింది. ఆ కప్పు ఫ్రాన్స్ గెలిచే నాటికి ఎంబాపె పుట్టనేలేదు. ఆ ఏడాది డిసెంబర్‌లో పుట్టాడు. చిన్నప్పటి నుంచి ఎంబాపెకు పుట్ బాల్ అంటే ప్రాణం. ఇంట్లో, వీధిలో ఎక్కడ చూసినా బంతితోనే కనబడేవాడు. ఎంబాపె తండ్రి కూడా స్థానిక ఎఎస్ బాండి ఫుట్‌బాల్ కోచ్ కూడా. దీంతో 16 ఏళ్ల వయసులోనే ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ కెరీర్ ఆరంభించాడు. ఫ్రెంచ్ క్లబ్ జట్లలో ఎక్కువగా ఆకట్టుకున్న ఎంబాపె.. స్పానిష్ క్లబ్ జట్లైన రియల్ మాడ్రిడ్, వాలెన్సియా తరపున కూడా ప్రాతినిథ్యం వహించాడు. 11 ఏళ్లకే ఇంగ్లండ్ ఫుట్‌బాల్ క్లబ్ జట్టైన చెల్సియా తరపున ఆడిన చరిత్ర ఎంబాపెది.
పిన్నవయస్కుడిగా..
టోర్నీలో భాగంగా శనివారం అర్జెంటీనాతో జరిగిన నాకౌట్ పోరులో ఫ్రాన్స్ 4-3 తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కీలక మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడంతో పాటు కైలిన్ ఎంబాపె మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒక ప్రపంచకప్ మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన రెండో పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. పుట్‌బాల్ దిగ్గజం పీలే (17 సంవత్సరాల 8 నెలల 6 రోజులకు) ఫిపా ప్రపంచకప్‌లో ఒక మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన అతి చిన్న వయస్కుడిగా తొలి స్థానంలో ఉన్నాడు. 60 సంత్సరాల అనంతరం ఫ్రాన్స్ ఆటగాడు కైలిన్ ఎంబాపె (19 సంవత్సరాల 6 నెలల 10 రోజులు) అర్జెంటీనాపై రెండు గోల్స్ చేయడంతో అత్యంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.
రొనాల్డోనే స్ఫూర్తి..
ఎంబాపెకు అత్యంత ఇష్టమైన క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో. తనకు అతనే స్ఫూర్తిగా చెబుతున్న ఎంబాపె.. దేశం కోసం మ్యాచ్‌లు గెలవడమే ఎక్కువ సంతోషాన్ని తీసుకొస్తుందన్నాడు. డబ్బు కంటే కూడా దేశం కోసం ఆడితే ఆ మజానే వేరుగా ఉంటుందన్నాడు. ఈ క‍్రమంలోనే ఫిఫా వరల్డ్ కప్‌లో వచ్చిన నజరానాను చారిటీలకు విరాళంగా ఇస్తానని ప్రకటించాడు.
Comments
Please login to add a commentAdd a comment