గేల్ చరిత్ర సృష్టిస్తాడా?
ఇండోర్: క్రిస్ గేల్..విధ్వంసకర క్రికెటర్. ఫీల్డ్ లో దిగాడంటే అవతలి బౌలర్ ఎవరనేది చూడకుండా చెలరేగిపోవడమే ఇతనికి తెలిసిన విద్య. అయితే ప్రపంచ ట్వంటీ 20 క్రికెట్ లో కొత్త చరిత్రను సృష్టించేందుకు అతి కొద్ది దూరంలో ఉన్నాడు గేల్. మరో 25 పరుగులు సాధిస్తే ట్వంటీ 20 క్రికెట్ లో పదివేల పరుగులను సాధించిన తొలి క్రికెటర్ గా గేల్ చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటిదాకా ప్రపంచ క్రికెట్లో ఏ బ్యాట్స్మన్ కు సాధ్యం కాని ఘనతను సాధించేందుకు గేల్ ఉవ్విళ్లూరుతున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 10 సీజన్ ఆరంభపు మ్యాచ్ ల్లోనే గేల్ ఆ రికార్డును సాధిస్తాడని భావించినా అది జరగలేదు. ఐపీఎల్ ఆరంభానికి ముందు పదివేల పరుగుల మైలురాయికి 63 పరుగులు దూరంలో ఉన్న గేల్ ఆ రికార్డును అందుకోవడంలో విఫలమయ్యాడు. ఇప్పటివరకూ రెండు ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన గేల్ 38 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. సన్ రైజర్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 32 పరుగులు చేసిన గేల్.. ఆపై ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో 6 పరుగులు చేశాడు. తాజాగా కింగ్స్ పంజాబ్ తో జరిగే మ్యాచ్ లో ఆ ఘనతను గేల్ సాధించే అవకాశం ఉంది. సోమవారం కింగ్స్ పంజాబ్ తో ఇండోర్ లో జరిగే మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. ఈ రోజు రాత్రి గం.8.00ని.లకు మ్యాచ్ జరుగుతున్న క్రమంలో ప్రధానంగా గేల్ రికార్డుపై ఆసక్తి నెలకొంది.