యువీకి మరో ఛాన్స్ దక్కేనా!
న్యూఢిల్లీ:యువరాజ్ సింగ్..ఒక చాంపియన్, ఒక పోరాట యోధుడు, ఒక స్పూర్తిదాయకమైన క్రికెటర్. తన క్రికెట్ కెరీర్లో ఎన్నో ఎత్తు పల్లాలు.. మరెన్నో ఒడి దుడుకులు. అతను పడిన ప్రతీసారి లేస్తూనే ఉన్నాడు. యువీకి తన జీవితంలో సంభవించిన క్యాన్సర్ అనే అతి పెద్ద విపత్కర పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డాడు. అయితే యువీ క్రికెట్ భవిష్యత్ గత కొన్నేళ్లుగా డోలాయమానంలో పడింది. క్రికెట్ నే శ్వాసగా జీవిస్తున్న యువీకి అవకాశాలు దాదాపు తగ్గిపోయినా, తన సత్తాను నిరూపించుకుంటూ జాతీయ జట్టులోకి వస్తూనే ఉన్నాడు. అతనిపై వచ్చిన విమర్శలకు బ్యాట్ తోనే సమాధానం చెబుతూ సెలక్టర్లను తనవైపుకు తిప్పుకుంటూనే ఉన్నాడు.
న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు యువీకి చోటు దక్కే అవకాశం ఉందని తొలుత భావించినా చివరకు అతను ఎంపిక కాలేదు. భారత జట్టులో యువ ఆటగాళ్లు తమను నిరూపించుకుంటూ వచ్చిన అవకాశాల్ని ఒడిసి పట్టుకోవడంతో యువీని పక్కనపెట్టేశారు. కాకపోతే మరో ఆటగాడు సురేష్ రైనా ఊహించనట్లుగానే జట్టులోకి వచ్చాడు. కాగా, ప్రస్తుతం రైనా వైరల్ ఫీవర్ తో బాధపడుతుండటంతో అతనికి తొలి వన్డేకు విశ్రాంతినిస్తున్నట్లు సెలక్టర్లు ప్రకటించారు. అదే సమయంలో రంజీల్లో పంజాబ్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న యువరాజ్ భారీ శతకం చేశాడు.
24 బౌండరీల సాయంతో 177 పరుగులు చేసి జాతీయ సెలక్టర్ల దృష్టిని మరోసారి ఆకర్షించాడు. అయితే రైనా స్థానంలో ఇంకా మరో ఆటగాడ్ని సెలక్టర్లు ప్రకటించలేదు. అయితే యువీని పిలిచే అవకాశాలు కూడా తక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం రంజీ మ్యాచ్ ఆడుతున్న యువీని ఆకస్మికంగా పిలిచే అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ అక్టోబర్ 20 వ తేదీన ఢిల్లీలో జరిగే రెండో వన్డే నాటికి రైనా కోలుకోని పక్షంలో యువీకి మరో ఛాన్స్ ఇచ్చేఅవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం.
ఆ రెండు వరల్డ్ కప్ల్లో యువీ కీలక పాత్ర
2007లో టీ 20 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టులో యువీ పాత్ర మరువలేనిది. ప్రధానంగా ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ల్లో స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఒక ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టి రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. దాంతో పాటు 2011 వరల్డ్ కప్ ను కైవసం చేసుకున్న భారత జట్టులో యువీ అటు బ్యాట్ తోనూ ఇటు బంతితోనూ రాణించాడు. ఆ వరల్డ్ కప్ లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గెలుచుకుని భారత్ రెండో వన్డే వరల్డ్ కప్ చేజిక్కించుకోవడంలో ముఖ్య భూమిక పోషించాడు. ఆ వరల్డ్ కప్ లో 326 పరుగులు చేయడంతో పాటు, 15 వికెట్లు సాధించాడు.
యువీకి గడ్డు పరిస్థితి
భారత జట్టులో కీలక ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకుని తన కెరీర్లో దూసుకుపోతున్న సమయంలో అతని జీవితంలోకి క్యాన్సర్ అనే మహమ్మారి చొరబడింది. ఆ భయంకరమైన ప్రాణాంతక వ్యాధిని కూడా యువీ లెక్క చేయలేదు. 2012, ఏప్రిల్ లో బోస్టాన్లో క్యాన్సర్ కు చికిత్స చేయించుకుని 10 వారాల విశ్రాంతి అనంతరం మళ్లీ ఫీల్డ్లోకి అడుగుపెట్టాడు. దానిలో భాగంగానే ఆ ఏడాది సెప్టెంబర్లో న్యూజిలాండ్ తో జరిగిన టీ 20లో 26 బంతుల్లో 34 పరుగులు చేశాడు. ఆ తరువాత శ్రీలంకలో జరిగిన టీ 20 వరల్డ్ కప్ లో యువీ నిలకడలేమీ, ఫిట్ నెస్ సమస్యలతో సతమతమయ్యాడు. దాంతో భారత జట్టుకు యువీ దాదాపు దూరమయ్యాడు. అయితే 2015లో రంజీ ట్రోఫీలో కొన్ని కీలక ఇన్నింగ్స్‌లతోపాటు విజయ్ హజారే ట్రోఫీలో తన సత్తా ప్రదర్శించి మళ్లీ సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఈ టోర్నీలో యువరాజ్ 5 మ్యాచ్‌లలో 85.25 సగటుతో 341 పరుగులు చేసి భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ఈ ఏడాది జరిగిన టీ 20 వరల్డ్ కప్లో యువీని ఎంపిక చేసినా పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో యువీ మళ్లీ ఉద్వాసనకు గురయ్యాడు. 2013లో దక్షిణాఫ్రికితో సెంచూరియన్ లో జరిగిన వన్డేలో చివరిసారి కనిపించాడు. అప్పట్నుంచి వన్డేల్లో పునరాగమనం చేయాలనుకున్నా యువీకి ఆ అవకాశం మాత్రం రావడం లేదు. ప్రస్తుతం యువీ తన ఫామ్ ను చాటు కోవడంతో భారత జట్టులో అతని స్థానంపై మరోసారి చర్చ మొదలైంది.