వింబుల్డన్ ప్రైజ్‌మనీ పెంపు
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రైజ్‌మనీని పెంచారు. ఈ ఏడాది పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 22 లక్షల పౌండ్ల చొప్పున (రూ. 18 కోట్ల 23 లక్షల 42 వేలు) అందజేస్తారు. గతేడాది సింగిల్స్ చాంపియన్స్‌కు 20 లక్షల పౌండ్లు చొప్పున ఇచ్చారు. క్రితం ఏడాదితో పోలిస్తే ఈసారి విజేతలకు 2 లక్షల పౌండ్లు పెంచినట్లు బుధవారం ఆల్ ఇంగ్లండ్ క్లబ్ ప్రకటించింది.
తొలి రౌండ్‌లో ఓడిన వారికి 35 వేల పౌండ్లు (రూ. 29 లక్షలు) లభిస్తాయి. గత ఆరు సంవత్సరాల్లో సింగిల్స్ విజేత ప్రైజ్‌మనీ రెట్టింపు కావడం గమనార్హం. 2011లో 1.1మిలియన్ పౌండ్లుగా ఉంది. కాగా ఈ ఏడాది టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ 12.5 శాతం పెరిగి 31.6మిలియన్ పౌండ్లకు చేరుకుంది. ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీ జూలై 3 నుంచి 16 వరకు జరుగుతుంది. మరోవైపు మహిళా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ గర్భస్థ శిశువుపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసిన రొమేనియా జట్టు కోచ్ ఇలీ నస్టాసేను ఈసారి రాయల్ బాక్స్‌లోకి ఆహ్వానించడంలేదని నిర్వాహకులు ప్రకటించారు.