
ఆక్లాండ్: న్యూజిలాండ్ పర్యటనను భారత మహిళల హాకీ జట్టు విజయంతో ముగించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 3–0 గోల్స్ తేడాతో న్యూజిలాండ్‌పై ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున నవనీత్ కౌర్ (45వ, 58వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... షరి్మలా దేవి (54వ నిమిషంలో) ఒక గోల్ సాధించింది. తొలి రెండు క్వార్టర్స్‌లో ఖాతా తెరవని భారత్ మూడో క్వార్టర్ చివరి నిమిషంలో బోణీ చేసింది. ఆ తర్వాత అదే జోరు కొనసాగించి చివరి క్వార్టర్‌లో నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది.
ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో 4–0తో న్యూజిలాండ్ డెవలప్‌మెంట్ జట్టును ఓడించిన టీమిండియా ఆ తర్వాత రెండు మ్యాచ్‌ల్లో 1–2తో, 0–1తో న్యూజిలాండ్ మహిళల సీనియర్ జట్టు చేతిలో ఓడింది. నాలుగో మ్యాచ్‌లో 1–0తో బ్రిటన్‌పై నెగ్గి, చివరి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును ఓడించి పర్యటనను ముగించింది.