
లండన్: ప్రపంచ కప్ హాకీలో క్వార్టర్ ఫైనల్ చేరేందుకు భారత మహిళల జట్టుకు మంచి అవకాశం. ప్రిక్వార్టర్స్‌లో భాగంగా నేడు బలహీన ప్రత్యర్థి ఇటలీతో తలపడుతుండటమే ఇందుకు కారణం. ఓడితే టోర్నీ నుంచి ఇంటికెళ్లే పరిస్థితుల్లో, ఒత్తిడిని అధిగమించి మరీ, తన కంటే మెరుగైన ర్యాంకులో ఉన్న అమెరికాపై మ్యాచ్‌ను డ్రా చేసుకున్న రాణి రాంపాల్ సేనకు... ఓ విధంగా ఇటలీ సులువైన ప్రత్యర్థే. అయితే, రెండు జట్ల లీగ్ దశ ప్రయాణం మాత్రం భిన్నంగా సాగింది. పూల్ ‘బి’లో ఐర్లాండ్‌పై ఓడి, ఇంగ్లండ్, అమెరికాలపై ‘డ్రా’లతో టీమిండియా బయటపడింది.
మరోవైపు ఇటలీ... చైనా, దక్షిణ కొరియాలపై నెగ్గినా, నెదర్లాండ్స్‌పై 1–12 తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ఆత్మవిశ్వాసం కూడగట్టుకున్న భారత్‌కే ఎక్కువ మొగ్గు కనిపిస్తోంది. ర్యాంకుల పరంగా చూసినా ఇటలీ (17) మన జట్టు (10) కంటే తక్కువ స్థాయిదే. అయితే, ముందుగా గోల్ ఇచ్చే బలహీనతను భారత్ అధిగమించాల్సి ఉంది. లీగ్ దశలో ఈ కారణంగానే కష్టాలు ఎదురయ్యాయి. ‘ప్రత్యర్థి మంచి జట్టే. మా బలంపై దృష్టిసారించాం. క్వార్టర్స్ చేరడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని భారత కెప్టెన్ రాణి రాంపాల్ వ్యాఖ్యానించింది.