న్యూఢిల్లీ: ఈ ఏడాది అక్టోబర్–నవంబర్‌లలో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి20 ప్రపంచకప్ నిర్వహణకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎటూ తేల్చుకోలేకపోవడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నిర్వహణకు సంబంధించిన కసరత్తును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) వేగవంతం చేసింది. టీ20 వరల్డ్‌కప్ జరగాల్సిన సమయంలోనే ఐపీఎల్‌ను జరిపితే ఎలా ఉంటుందనే ఆలోచనలో బీసీసీఐ ఉంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా ఐపీఎల్ నిర్వహణకు సిద్ధంగా ఉండాలని తమ అనుసంధాన క్రికెట్ అసోసియేషన్‌లను బీసీసీఐ అలెర్ట్ చేసింది. ఈ మేరకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. రాష్ట్ర అసోసియేషన్‌లకు లేఖ రాశాడు. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గితే ఐపీఎల్ నిర్వహణపై అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామన్నామని, దాంతో అన్ని రాష్ట్ర క్రికెట్ బోర్డులు సిద్ధంగా ఉండాలన్నారు. అవసరమైతే ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్‌ను నిర్వహణను పరిశీలిద్దామని పేర్కొన్నాడు. మనకు అందుబాటులో ఉండే అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు లేఖలో స్పష్టం చేశాడు. కచ్చితంగా ఈ సీజన్ ఐపీఎల్ జరుగుతుందనే ఆశాభవాన్ని వ్యక్తం చేసిన గంగూలీ.. ఆటగాళ్లంతా ఈ క్యాష్ రిచ్ లీగ్‌ను ఆడటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. ఇటు భారత క్రికెటర్లే కాకుండా, విదేశీ ఆటగాళ్ల సైతం ఐపీఎల్ ఆడతామనే సంకేతాలు ఇచ్చిన విషయాన్ని గంగూలీ ప్రస్తావించాడు. ఐపీఎల్ నిర‍్వహణపై సాధ్యమైనంత తొందర్లో నిర్ణయం తీసుకుంటామన్నాడు. (టి20 ప్రపంచకప్ భవితవ్యంపై ఐసీసీ తర్జనభర్జన)
కాగా, ఈ ఏడాది అక్టోబర్–నవంబర్‌లలో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి20 ప్రపంచకప్ నిర్వహణకు సంబంధించి ఐసీసీ వాయిదాల పర్వం కొనసాగుతోంది. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో మరోసారి ఐసీసీ ఎటూ తేల్చలేకపోయింది. ప్రపంచకప్ విషయంలో తుది నిర్ణయం తీసుకునేందుకు మరో నెల రోజుల పాటు వేచి చూడాలని నిర్ణయించింది. టి20 ప్రపంచకప్‌తో పాటు 2021లో మహిళల వన్డే వరల్డ్ కప్‌లను షెడ్యూల్ ప్రకారం ఎలా నిర్వహించాలనే ప్రణాళికలతో పాటు ఇతర ప్రత్యామ్నాయాలను పరిశీలించడం కూడా కొనసాగిస్తామని ఐసీసీ పేర్కొంది. కోవిడ్–19 కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఎదుర్కొంటున్న పరిస్థితిని సమీక్షిస్తూనే ఆటగాళ్ల ఆరోగ్య భద్రత తదితర అంశాలపై కూడా దృష్టి పెట్టినట్లు చెప్పింది. ఒకవేళ టీ20 వరల్డ్‌కప్ వాయిదా పడితే, ఐపీఎల్ సాధ్యపడుతుందనేది గంగూలీ లేఖ సారాంశం. దీనిలో భాగంగానే అన్ని క్రికెట్ అసోసియేషన్‌లను సిద్ధంగా ఉండాలని ముందుగా విజ్ఞప్తి చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment