మోరెతో నా ఆట మారె! | Working with Kiran More on keeping helped in Australia, says Rishabh Pant | Sakshi
Sakshi News home page

మోరెతో నా ఆట మారె!

Published Sun, Feb 17 2019 12:52 AM | Last Updated on Sun, Feb 17 2019 12:52 AM

Working with Kiran More on keeping helped in Australia, says Rishabh Pant - Sakshi

రిషభ్‌ పంత్‌... భారత క్రికెట్‌ యువ తార. అన్ని స్థాయిల్లో అరంగేట్రం నుంచే అదరగొడుతూ మెరుపు షాట్లకు మారు పేరుగా నిలిచాడు. దూకుడైన ఆటతో మహేంద్ర సింగ్‌ ధోనికి దీటైన వారసుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే, బ్యాట్స్‌మన్‌గా సంచలనాలు సృష్టించినా అతడి వికెట్‌ కీపింగ్‌ సామర్థ్యంపై మాత్రం నిన్న మొన్నటిదాకా అనుమానాలున్నాయి. ఆస్ట్రేలియా పర్యటనతో వాటిని కూడా పటాపంచలు చేశాడు. ఈ మెరుగుదల వెనుక భారత మాజీ కీపర్‌ కిరణ్‌ మోరె సూచనలు, సలహాలు ఉన్నాయని చెబుతున్నాడతడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మరిన్ని విషయాలు వెల్లడించాడు.

న్యూఢిల్లీ: సీనియర్‌ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ నుంచి గట్టి పోటీని తట్టుకుని ప్రపంచ కప్‌ బెర్తును దాదాపు ఖాయం చేసుకున్నాడు రిషభ్‌ పంత్‌. బ్యాటింగ్‌ సామర్థ్యంరీత్యా వంక పెట్టలేకున్నా, కీపింగ్‌లో లోపాలతో అతడి ఎంపికపై అనుమానాలున్నాయి. ముఖ్యంగా ఇంగ్లండ్‌ పర్యటనలో ఎక్కువగా బైస్‌ రావడంతో పంత్‌పై విమర్శలు మొదలయ్యాయి. కానీ, ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చేసరికి అతడు ఆ సమస్యను అధిగమించాడు. ఆడిలైడ్‌ టెస్టులో ప్రపంచ రికార్డు 11 క్యాచ్‌లను సమం చేయడంతో పాటు సిరీస్‌లో 20 క్యాచ్‌లు పట్టి ప్రశంసలు పొందాడు. ఈ రెండు అనుభవాల మధ్య జాతీయ క్రికెట్‌ అకాడమీలో కిరణ్‌ మోరె వద్దకు వెళ్లడం తన కీపింగ్‌ సామర్థ్యాన్ని మెరుగుపర్చిందని పంత్‌ అంటున్నాడు. ఇంకా ఏం చెప్పాడో అతడి మాటల్లోనే... 

ఇంగ్లండ్‌లో ఇబ్బంది ఇందుకే... 
ఎరుపు రంగు డ్యూక్‌ బంతి ఇరువైపులా స్వింగ్‌ అయ్యే ఇంగ్లండ్‌లో కీపింగ్‌ చేయడం భిన్న అనుభవం. వికెట్‌ దాటిన తర్వాత కూడా బంతి గాలిలో సుడులు తిరుగుతుంది. ఈ పర్యటన తర్వాత నేను జాతీయ క్రికెట్‌ అకాడమీలో మోరె వద్దకు వెళ్లా. చేతులను ఏ దిశలో ఉంచాలి? శరీరాన్ని ఎలా కదిలించాలి? వంటి ప్రత్యేక అంశాలపై దృష్టిపెట్టా. ప్రతి కీపర్‌కు తమదైన శైలి ఉంటుంది. నా వరకు వచ్చేసరికి అందులో కొంత సర్దుబాటు చేసుకున్నా. తగిన ప్రతిఫలం దక్కింది. 

చిన్న వయసులోనే అవకాశాలపై... 
ఏదైనా నేర్చుకోవడానికి, అవకాశాలను అందిపుచ్చుకోవడానికి చిన్న వయసులోనే జట్టులోకి రావడం మేలు చేస్తుంది. కొత్త విషయాలు తెలు సుకోవాలనే ఆసక్తి ఉంటుంది. ఇంగ్లండ్‌లో చివరి టెస్టులో సెంచరీ చేయడం నా ఆత్మవిశ్వాసాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. అప్పటి నుంచి కొన్ని అంశాల్లో నన్ను నేను మెరుగుపర్చుకోవడంపై దృష్టిపెట్టా. ఇంగ్లండ్‌తో మొదలైన ‘నేర్చుకోవడం అనే ఆలోచన’ ఆస్ట్రేలియాలో మేలు చేసింది. 

అంచనాల ఒత్తిడి గురించి... 
భారత్‌కు ఆడినా, ఐపీఎల్‌లో ఆడినా అంచనాల ఒత్తిడి, అభద్రతా భావం ఒకే తీరుగా ఉంటుంది. వాటిపై ఆలోచిస్తూ కూర్చుంటే ఆటపై దృష్టిపెట్టలేం. అలాంటివి అధిగమించి రాణిస్తేనే ఓ ఆటగాడిగా మనమేంటో తెలుస్తుంది. ఏ మ్యాచ్‌ అయినా ఒకటే అని భావించాలి. 

బ్యాటింగ్‌ స్థానం.. ఢిల్లీ ఫ్రాంచైజీపై... 
ఒక బ్యాట్స్‌మన్‌గా నేనెప్పుడూ టాపార్డర్‌లో ఆడేందుకే మొగ్గుచూపుతా. అయినా, ఇక్కడ జట్టు సమతూకం ముఖ్యం. ఈసారి మా ఢిల్లీ ఫ్రాంచైజీ పేరు, జెర్సీ మారింది. కొత్త ఆటగాళ్లు వచ్చారు. ఇది అనుభవం, యువతరం కలగలిసిన కూర్పు. రాబోయే సీజన్‌ మాకు అద్భుతంగా సాగుతుందని భావిస్తున్నా. 

సోషల్‌ మీడియా ప్రభావం... 
వ్యక్తిగత జీవితాలను హరించే సోషల్‌ మీడియాతో జాగ్రత్తగా ఉండాలి. మీ గురించి ఎన్నో ప్రశంసలు రావొచ్చు. ఇదే సమయంలో ప్రతికూల వ్యాఖ్యల్ని భరించే శక్తి మీలో ఉండాలి. ఈ ప్రభావంలో పడకుండా నన్ను ఉన్నత స్థాయికి చేర్చే క్రికెట్‌ గురించి ఆలోచిస్తా. ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటూనే ఎలా ముందుకెళ్లాలనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అంశం. 

నేను చేసినవి చిన్న మార్పులే... 
నేనిచ్చినవి చిన్న సలహాలే. పంత్‌ కీపింగ్‌లో ఎక్కువగా పక్కకు జరుగుతుంటాడు. అలా కాకుండా ఛాతీ భాగాన్ని విశాలం చేసి ఉంచాలని సూచించా.  క్యాచ్‌లను ఒడిసి పట్టడంతో పాటు, గాయాలకు గురికాకుండా చేతి వేళ్లను బౌలర్‌ వైపు కాకుండా నేలను చూసేలా ఉంచాలని చెప్పా.  –కిరణ్‌ మోరె, భారత మాజీ వికెట్‌ కీపర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement