వారు అలా ఆడితే ఏమీ చేయలేం!
గేల్, డివిలియర్స్‌పై ధోని వ్యాఖ్య
పెర్త్: క్రిస్ గేల్, డివిలియర్స్ జోరు మీదున్నప్పుడు ప్రత్యర్థి ఆటగాళ్లు, కెప్టెన్ ఏమీ చేయలేరని, వారిపై ఎలాంటి వ్యూహం పని చేయదని భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వ్యాఖ్యానించాడు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్ విఫలం కాగా, శుక్రవారం విండీస్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గేల్‌ను ఎలా అడ్డుకుంటారనే ప్రశ్నకు స్పందిస్తూ ధోని ఈ మాట అన్నాడు.
‘ఈ ఇద్దరిపై ఎలాంటి ప్రణాళికలు రూపొందించకపోవడమే పెద్ద ప్రణాళిక అనవచ్చు. వారు సిక్సర్లు బాదుతున్నప్పుడు ఏ ఫీల్డింగ్ పనికొస్తుంది. షార్ట్ పించ్ బంతులపై కూడా చెలరేగుతుంటే ఏం చేయగలం. వారి కోసం ఒక ప్రత్యేక వ్యూహంలాంటిది ఏమీ రూపొందించలేం. కొన్ని సార్లు బౌలర్లకు స్వేచ్ఛ ఇచ్చి వైవిధ్యమైన బంతులు ప్రయత్నించడం ఒక్కటే మిగిలిన అవకాశం’ అని ధోని అభిప్రాయ పడ్డాడు.