
టెన్నిస్ బంతులతో టీమిండియా ప్రాక్టీస్
సిడ్నీ: ప్రపంచకప్ సెమీఫైనల్ కోసం భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్ ప్రారంభించింది. దీంట్లో భాగంగా కోచ్ డంకెన్ ఫ్లెచర్ ఎక్కువగా బ్యాట్స్‌మన్ సురేశ్ రైనాపై దృష్టి పెట్టారు. షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో రైనా బలహీనత తెలిసిందే. అయితే ఇప్పుడు ఆసీస్‌తో జరుగబోయే మ్యాచ్ కాబట్టి 45 నిమిషాల పాటు రైనాతో కోచ్ తడితో కూడిన టెన్నిస్ బంతులతో ప్రాక్టీస్ చేయించారు. నెట్స్‌లో ఓవైపు రాకెట్‌తో కోచ్ వేగంగా సర్వ్ చేస్తుంటే రైనా వాటిని ఆడాడు.
పచ్చికతో కూడిన పిచ్‌పై ఈ బంతిని విసిరితే వేగంగా వెళుతుందనే ఉద్దేశంతో కోచ్ ఇలా ప్రాక్టీస్ చేయించారు. రైనా శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని కొన్ని బంతులను విసరగా వాటిని హుక్ షాట్ ఆడబోయిన రైనా కొన్నిసార్లు మాత్రమే సక్సెస్ అయ్యాడు. అటు ధోని కూడా కొద్దిసేపు ఈ తరహా బంతులను రైనాకు విసిరాడు. అలాగే మిగతా బ్యాట్స్‌మెన్ పేసర్లు, స్పిన్నర్లను ఎదుర్కొంటూ తమ ప్రాక్టీస్ కొనసాగించారు.
ప్రాక్టీస్‌కు షమీ దూరం: భారత పేసర్ షమీ సోమవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. అయితే షమీ మోకాలి గాయంతో బాధపడుతున్నట్లు వినిపిస్తున్న కథనాలను టీమ్ మీడియా మేనేజర్ ఆర్‌ఎన్ బాబా ఖండించారు. ‘అతడు వంద శాతం ఫిట్‌గా ఉన్నాడు. సెమీస్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడు. మోహిత్, ఉమేశ్ నెట్స్‌లో పాల్గొన్నా తను మరో రోజు విశ్రాంతి కావాలన్నాడు. టీమ్ దానికి అంగీకరించింది’ అని బాబా చెప్పారు.