ఇంగ్లండ్‌తో మ్యాచ్‌: ఓపెనర్లు అదరగొట్టినా.. | World Cup 2019 Australia Set 286 Runs Target For England | Sakshi
Sakshi News home page

ఫించ్‌ మరో శతకం.. ఇంగ్లండ్‌ లక్ష్యం 286

Published Tue, Jun 25 2019 6:45 PM | Last Updated on Tue, Jun 25 2019 8:44 PM

World Cup 2019 Australia Set 286 Runs Target For England - Sakshi

లండన్‌: భారీ స్కోర్‌ సాధిస్తుందనుకున్న డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా.. సాధారణ స్కోరుకే పరిమితమైంది. ప్రపంచకప్‌లో భాగంగా ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 286 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్‌ ఆటగాళ్లో సారథి ఆరోన్‌ ఫించ్‌ (100;116 బంతుల్లో 11ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కగా.. డేవిడ్‌ వార్నర్‌(53; 61 బంతుల్లో 6ఫోర్లు) అర్దసెంచరీతో రాణించాడు. టాపార్డర్‌ జోరును చూసి ఆసీస్‌ 300కి పైగా పరుగులు సాధిస్తుందని భావించారు. అయితే మిడిల్‌, లోయర్‌ ఆర్డర్‌ మరోసారి విఫలమవడంతో ఇంగ్లండ్‌ ముందు ఆసీస్‌ భారీ స్కోర్‌ను నిర్దేశించలేకపోయింది. తొలుత అంతగా ఆకట్టుకోని ఇంగ్లీష్‌ బౌలర్లు చివర్లో విజృంభించి ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌కు చెమటలు పట్టించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో వోక్స్‌ రెండు వికెట్లతో రాణించగా.. ఆర్చర్‌, వుడ్‌, స్టోక్స్‌, మొయిన్‌లు తలో వికెట్‌ పడగొట్టారు.  

లార్డ్స్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ ఛేజింగ్‌కే మొగ్గుచూపింది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు మరోసారి శుభారంభాన్ని అందించారు. ఇద్దరూ హాఫ్‌ సెంచరీలతో నిలకడగా రాణిస్తున్న తరుణంలో డేవిడ్‌ వార్నర్‌(53) మొయిన్‌ అలీ బౌలింగ్‌లో వెనుదిరుగుతాడు. దీంతో తొలి వికెట్‌కు 123 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతర వచ్చిన బ్యాట్స్‌మెన్‌ ఎవరూ ఆరోన్‌ ఫించ్‌తో కలిసి భారీ భాగస్వామ్యాలు నమోదు చేయలేకపోయారు. ఈ క్రమంలోనే ఫించ్‌ మరో శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. సెంచరీ అనంతరం ఫించ్‌ వెనుదిరగడంతో ఆసీస్‌ స్కోర్‌ బోర్డు నెమ్మదించింది. ఇక వరుసగా వికెట్లు తీస్తూ ఆసీస్‌పై ఇంగ్లండ్‌ బౌలర్లు ఒత్తిడి పెంచారు.
 

మిడిలార్డర్‌ విఫలం
30 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌ ఒక్క వికెట్‌ నష్టానికి 162 పరుగులు చేసింది. వికెట్లు చేతులుండంతో పాటు మ్యాక్స్‌వెల్‌, స్టోయినిస్‌ వంటి హిట్టర్లు ఉండటంలో ఇంగ్లండ్‌ ముందు ఆసీస్‌ భారీ స్కోర్‌ సాధిస్తుందనుకున్నారు. అయితే చివరి ఓవర్లను ఇంగ్లండ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. స్మిత్‌(38), ఖవాజా(23), మ్యాక్స్‌వెల్‌(12), స్టొయినిస్‌(8)లు పూర్తిగా నిరాశపరిచారు. దీంతో ఆసీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement