
లండన్: ఇంగ్లండ్ వేదికగా జరుగుతన్న ప్రపంచకప్‌లో ఐపీఎల్ స్టార్ బౌలర్, అఫ్గానిస్తాన్ సంచలనం రషీద్ ఖాన్ తీవ్రంగా నిరాశ పరుస్తున్నాడు. అఫ్గాన్ బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపించాల్సిన అతడు దారుణంగా విఫలమవడంతో ఆ జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఐపీఎల్‌లో అతడి బౌలింగ్‌లో ఆడడానికి తంటాలు పడి, ఔట్ కాకుండా ఉంటే చాలని భావించిన బ్యాటర్స్ తాజా ప్రపంచకప్‌లో వీరవిహారం చేస్తున్నారు. ఇప్పటికే ఈ యువ సంచలనం ఆట తీరుపై విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. తాజాగా రషీద్‌పై ఆ జట్టు సారథి గుల్బాదిన్ నైబ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
‘రషీద్ ఖాన్ బౌలింగ్‌లో విఫలమవడం గురించి నేను ఎక్కువగా మాట్లాడను. అయితే బంగ్లాదేశ్ మ్యాచ్‌లో అతడి చెత్త ఫీల్డింగ్ అఫ్గాన్ కొంపముంచింది. ఈ మ్యాచ్‌లో రషీద్ ఫీల్డింగ్ వైఫల్యంతో బంగ్లా అదనంగా 30-35 పరుగులు సాధించింది. ఇది కూడా మా జట్టు ఓటమిపై ప్రభావం చూపింది. అయితే ఫీల్డింగ్ వైఫల్యంపై నిరాశపడకుండా బౌలింగ్‌పై దృష్టి పెట్టమని చెప్పినందుకు నాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బౌలింగ్‌లో ఒక్క వికెట్ పడగొట్టకుండా, ఫీల్డింగ్ వైపల్యంతో రషీద్ అందరినీ పూర్తిగా నిరాశపరిచాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్ అనంతరం రషీద్ గుణపాఠం నేర్చుకుంటాడని అనుకున్నాం. కానీ అతడిలో ఎలాంటి మార్పు రాలేదు. ప్రపంచకప్ మిగతా మ్యాచ్‌ల్లో తమ వంతు మంచి ప్రదర్శన కోసం కష్టపడతాము’అంటూ గుల్బాదిన్ నైబ్ పేర్కొన్నాడు. ఇక సోమవారం బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో అఫ్గాన్ 62 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే.