
లండన్: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియాతో మ్యాచ్‌కు ముందే దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ కగిసో రబాడ మాటల యుద్దానికి తెరదీశాడు. టీమిండియాలో కీలక ఆటగాడు, సారథి విరాట్ కోహ్లిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. కోహ్లి గొప్ప బ్యాట్స్‌మన్ అయినప్పటికీ అతడికి పరిపక్వత లేదని ఎద్దేవ చేశాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో కూడా కోహ్లితో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ టోర్నీలో జరిగిన వివాదాన్ని వివరిస్తూ కోహ్లిని చులకన చేసి మాట్లాడాడు.
‘ఐపీఎల్‌లో ఆరోజు వివాదానికి కారణం కోహ్లినే. నా బౌలింగ్‌లో అతడు ఫోర్ కొట్టడంతో నేను ఆలోచనలో పడ్డాను. అప్పుడు కోహ్లి నన్ను ఓ మాట అనడంతో అదే మాటను కోహ్లిని అన్నాను. దీంతో వెంటనే అతడు కోపంతో రగిలిపోయాడు. అతను అద్బుతమైన బ్యాట్స్‌మన్ అయినంత మాత్రాన అతడు అన్న మాటలు పడాలా?. అతడు తిడితే నేను పడను. కోహ్లి ఇంకా పరిపక్వత సాధించాల్సి ఉంది. ఆట మాత్రమే కాదు వ్యక్తిత్వం కూడా ఉండాలి’అంటూ రబాడ వ్యాఖ్యానించాడు.
అయితే ఆటగాళ్లతో గొడవలు పడటం రబాడకు కొత్తేం కాదు. 2017లో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌తో అనుచితంగా ప్రవర్తించడంతో ఒక టెస్టు మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. గతేడాది ఆసీస్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై నోరు పారేసుకున్నాడు. ఇక స్మిత్‌తో శృతిమించి ప్రవర్తించడంతో మరోసారి సస్సెన్షన్‌కు గురయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment