కబడ్డీ పండుగ
నేటినుంచి ప్రపంచకప్
ఫేవరెట్‌గా బరిలోకి భారత్
తొలి మ్యాచ్‌లో కొరియాతో ఢీ
దేశవ్యాప్తంగా పండుగ సంబరాలు మొదలయ్యారుు. దేవీ నవరాత్రుల నుంచి నెలాఖరులో దీపావళి వరకూ అంతటా సందడే. ఈ ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు క్రీడాభిమానులకు మరో పండేగ వచ్చేసింది. గత రెండేళ్లుగా ప్రొ కబడ్డీ లీగ్ ద్వారా వినోదాన్ని ఆస్వాదిస్తున్న అభిమానుల కోసం నేడు కబడ్డీ ప్రపంచకప్‌కు తెరలేవనుంది. మనం మేటిగా ఉన్నా, మన ఆటలో ’చెడుగుడు’ ఆడేందుకు ఆరు ఖండాల జట్లు సై అంటున్నారుు.
అహ్మదాబాద్: భారత్‌లోనే గతంలో రెండు కబడ్డీ ప్రపంచ కప్ పోటీలు జరిగాయనే విషయం మనలో ఎంత మందికి తెలుసు? అసలు అప్పుడు టోర్నీ జరిగినట్లు గానీ మన జట్టే విజేతగా నిలిచినట్లు గానీ ఎవరికై నా గుర్తుందా! 2004, 2007లలో ఈ టోర్నీ నిర్వహించిన తర్వాత ఆదరణ లేక ఎవరూ పట్టించుకోక మరో వరల్డ్ కప్ నిర్వహణ కోసమే తొమ్మిదేళ్లు ఆగాల్సి వచ్చింది. కానీ ఈ సారి మాత్రం అపూర్వ రీతిలో అభిమాన గణం వరల్డ్ కప్ కోసం ఎదురు చూశారు. టోర్నీని సూపర్ సక్సెస్ చేసేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారు. ప్రొ కబడ్డీ లీగ్ ద్వారా వచ్చిన మార్పే ఇదంతా. ఇదే జోరులో కబడ్డీని విశ్వవ్యాప్తం చేసేందుకు నిర్వాహకులు కూడా గట్టి పట్టుదలగా ఉన్నారు. ఈ నెల 22న ఫైనల్ జరిగే వరకు ప్రతీ రోజు కబడ్డీ వినోదానికి గ్యారంటీ.
ఆరు ఖండాలనుంచి...
కబడ్డీ క్రీడను ప్రస్తుతం 32 దేశాలు ఆడుతున్నారుు. ఇంకా ఒలింపిక్స్ అవకాశం రాకపోరుునా ఆసియా క్రీడల్లో మాత్రం భాగంగా ఉంది. వరల్డ్ కప్‌లో మాత్రం 12 దేశాలు పాల్గొంటున్నారుు. 2007 ప్రపంచకప్‌తో పోలిస్తే ఈ సారి నాలుగు జట్లు తక్కువగా ఉన్నారుు. అరుుతే మొత్తం ఆరు ఖండాలకు చెందిన జట్లు ఈ మెగా ఈవెంట్ బరిలోకి దిగుతుండటం విశేషం. మొత్తం 12 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. ఆయా గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తారుు. ఆడే దేశాలు తక్కువగానే ఉన్నా కబడ్డీని ప్రపంచానికి పరిచయం చేసే క్రమంలో మొత్తం 120 దేశాల్లో ఈ టోర్నీని టీవీల్లో ప్రసారం చేస్తుండటం మరో విశేషం. అహ్మదాబాద్‌లో కొత్తగా నిర్మించిన ’ది ఎరీనా’ స్టేడియం అన్ని మ్యాచ్‌లకు వేదిక కానుంది.
అనూప్ కుమార్ సారథ్యంలో...
‘సొంతగడ్డపై ఒక వేళ మేం ప్రపంచకప్ ఓడిపోతే అంతకంటే బాధాకర ఘటన మరొకటి ఉండదు’ ... భారత కబడ్డీ జట్టు కెప్టెన్ అనూప్ కుమార్ చేసిన వ్యాఖ్య ఇది. గత రెండు సార్లు వరల్డ్ కప్ విజేతగా నిలవడమే కాదు... 1990 ఆసియా క్రీడల్లో కబడ్డీని ప్రవేశపెట్టిననాటినుంచి వరుసగా ఏడు స్వర్ణాలు గెలిచి తమ ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్టుపై సహజంగానే అంచనాలు భారీగా ఉన్నారుు. ఏ రకంగా చూసినా ఇతర జట్లతో పోలిస్తే భారత్ చాలా పటిష్టంగా ఉంది. కొంత వరకు ఇరాన్, కొరియాలనుంచి ప్రతిఘటన మినహా... ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలాంటి టీమ్‌లు ఏ మాత్రం పోటీనిచ్చే స్థితిలో లేవు. అందులోనూ ప్రొ కబడ్డీ లీగ్ పుణ్యమా అని మన జట్టులో ఆటగాళ్లంతా మంచి ఫామ్‌లో ఉన్నారు. గత రెండు వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత్... ఇరాన్‌నే ఓడించడం విశేషం. ఈ రెండు సార్లు బంగ్లాదేశ్ మూడో స్థానంలో నిలిచింది. ప్రస్తుత భారత జట్టు సభ్యులలో ఎవరూ గత వరల్డ్‌కప్‌లో ఆడలేదు. మన్‌జీత్ ఛిల్లర్, దీపక్ హుడా, జస్వీర్, సందీప్ నర్వాల్, రాహుల్ చౌదరిలవంటి స్టార్ ఆటగాళ్లు జాతీయ జట్టు తరఫున చెలరేగేందుకు సిద్ధమయ్యారు.
భారత జట్టు: అనూప్ కుమార్, అజయ్ ఠాకూర్, దీపక్ హుడా, జస్వీర్ సింగ్, పర్‌దీప్ నర్వాల్, రాహుల్ చౌదరి (రైడర్లు), ధర్మరాజ్ చేరలతన్, మోహిత్ ఛిల్లర్, సురేందర్ నాడా, సుర్జీత్ (డిఫెండర్లు), కిరణ్ పర్మార్, మన్‌జీత్ ఛిల్లర్, నితిన్ తోమర్, సందీప్ నర్వాల్ (ఆల్‌రౌండర్లు).