
ప్రతిష్ట కోసం జర్మనీ
గత రెండు ప్రపంచకప్‌లలో వరుసగా సెమీస్‌లో ఓడిన జట్టు జర్మనీ. ఒకవేళ ఈసారి కూడా ఓడిపోతే... చోకర్స్ అనే ముద్ర పడిపోతుంది. నాలుగేళ్ల ఎదురు చూపుల్ని, నాలుగు వారాల కష్టాన్ని ఒక్క మ్యాచ్‌తో పోగొట్టుకునే అలవాటును మార్చుకోవాలి... ఈ సారి ఎలాగైనా గెలవాలి... ప్రతిష్ట నిలుపుకోవాలనేది జర్మనీ తపన.
నెయ్‌మార్ కోసం బ్రెజిల్
‘ప్రపంచకప్ ఫైనల్ ఆడాలన్న నా కలకు దూరం చేశారేమో... కానీ ప్రపంచకప్ సాధించిన జట్టు సభ్యుడిగా ఉండాలన్న నా కలను దూరం చేయలేరు’.. గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్న నెయ్‌మార్ అన్న ఈ ఒక్క మాట తన సహచరులపై అతడికి ఉన్న నమ్మకానికి నిదర్శనం. అందుకే బ్రెజిల్ ఆటగాళ్లలో, అభిమానుల్లో ఒకటే కసి... నెయ్‌మార్ కోసమైనా గెలవాలి!
బెలో హారిజోంట్: పుష్కరకాలం నుంచి ఊరిస్తున్న ‘టైటిల్ పోరు’కు మరోసారి అర్హత సాధించేందుకు బ్రెజిల్ సమాయత్తమైంది. ఆశాకిరణం నెయ్‌మార్.... సారథి థియాగో సిల్వా గైర్హాజరీలో బ్రెజిల్ కీలకమైన పోరులో బరిలోకి దిగనుంది. మంగళవారం జరిగే సెమీఫైనల్లో మాజీ చాంపియన్ జర్మనీతో బ్రెజిల్ తలపడనుంది.
గత ఐదు మ్యాచ్‌ల్లో ‘యువతార' నెయ్‌మార్ ‘ప్లే మేకర్’ పాత్ర పోషించడంతో బ్రెజిల్‌కు అంతగా ఇబ్బందులు ఎదురుకాలేదు. అయితే కొలంబియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ సందర్భంగా నెయ్‌మార్ గాయపడి మొత్తం టోర్నీకే దూరమయ్యాడు. మరోవైపు చివరిసారిగా 1990లో విశ్వవిజేతగా నిలిచిన జర్మనీ నాలుగో ప్రయత్నంలోనూ తడబడితే ఆ జట్టుపై కీలకదశలో చేతులెత్తేస్తోందనే అపవాదు పడిపోతుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య సెమీఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. ఈ రెండు జట్ల బలాలు, బలహీనతలు, అవకాశాలు, ముప్పులపై ‘స్వాట్’ విశ్లేషణ.
బలం
* సొంతగడ్డపై ఆడటం.
* టోర్నీలో ప్రతి 8 ప్రయత్నాల్లో ఒకసారి గోల్ చేయడం.
* మేటి కోచ్ స్కొలారీ వ్యూహాలు.
* స్వదేశంలో గత 41 మ్యాచ్‌లుగా అజేయ రికార్డు.
* దూకుడైన ఆటతీరు. ఆటగాళ్ల మధ్య సమన్వయం.
* ఈ టోర్నీలో 2,938 పాస్‌లు పూర్తి చేసింది.
* ప్రతి 7 ప్రయత్నాలకు, ప్రతి 48 నిమిషాలకు గోల్ చేసింది.
బలహీనత
* స్టార్ ప్లేయర్ నెయ్‌మార్, కెప్టెన్ థియాగో సిల్వా సేవలు అందుబాటులో లేకపోవడం.
* డిఫెన్స్‌లోనూ లోపాలు కనిపిస్తున్నాయి. చివరి మూడు మ్యాచ్‌ల్లో ఆ జట్టు గోల్స్ సమర్పించుకుంది.
* గత రెండు ప్రపంచకప్‌లలో సెమీఫైనల్లో నిష్ర్కమించిన రికార్డు.
* ఆతిథ్య జట్టుతో ఆడుతున్నామనే ఒత్తిడి.
అవకాశం
* నెయ్‌మార్ గైర్హాజరీలో ఇతరులు స్టార్ హోదా పొందొచ్చు.
* 2002 తర్వాత మళ్లీ ఫైనల్‌కు చేరే అవకాశం.
* 1998లో ఫ్రాన్స్ తర్వాత ఫైనల్‌కు చేరిన ఆతిథ్య
జట్టుగా రికార్డు.
* 2002లో ఫైనల్లో బ్రెజిల్ చేతిలో ఓటమికి ప్రతీకారం.
* 1950లో బ్రెజిల్ ప్రపంచకప్‌లో నిషేధం కారణంగా పాల్గొనలేకపోయిన జర్మనీ ఈసారి ఫైనల్‌కు చేరే అవకాశం.
ముప్పు
* బ్రెజిల్ నెగ్గిన అన్ని మ్యాచ్‌ల్లో ఆ జట్టే తొలుత ఖాతా తెరిచింది. ఒకవేళ సెమీస్‌లో ప్రత్యర్థి జట్టు మొదట ఖాతా తెరిస్తే మొదటికే మోసం రావొచ్చు.
* గత రెండు ప్రపంచకప్‌లలో సెమీస్ వరకు జోరుగా ఆడి తడబడింది.
* ఓడితే చోకర్స్ ముద్ర పడిపోతుంది.
విశేషాలు
* బెర్లిన్ గోడ కూల్చివేత తర్వాత జర్మనీతో బ్రెజిల్ జట్టు తొమ్మిదిసార్లు తలపడింది. ఇందులో ఆ జట్టు ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గి, రెండింటిని ‘డ్రా' చేసుకొని, మరో రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
* 1966 నుంచి ఇప్పటివరకు ఆడిన 13 ప్రపంచకప్‌లలో జర్మనీ 10 సార్లు సెమీఫైనల్‌కు చేరింది. 10 పర్యాయాల్లో ఆ జట్టు ఆరుసార్లు ఫైనల్లోకి ప్రవేశించి రెండు సార్లు విజేతగా నిలిచింది. నాలుగుసార్లు రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
* జర్మనీ స్టార్ ప్లేయర్ మిరోస్లావ్ క్లోజ్ మరో గోల్ సాధిస్తే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుడవుతాడు. ప్రస్తుతం క్లోజ్ 15 గోల్స్‌తో బ్రెజిల్ దిగ్గజం రొనాల్డో సరసన ఉన్నాడు.
* స్వదేశంలో గత 41 మ్యాచ్‌ల్లో బ్రెజిల్‌కు పరాజయం ఎదురుకాలేదు. చివరిసారి ఆ జట్టు 2002లో పరాగ్వే చేతిలో ఓడిపోయింది.
* బ్రెజిల్ జట్టు కోచ్ హోదాలో లూయిజ్ ఫెలిప్ స్కొలారీకి ఒక్క ఓటమీ ఎదురుకాలేదు. 2002లో ఆయన కోచ్‌గా ఉన్నపుడే బ్రెజిల్ చివరిసారి విశ్వవిజేతగా నిలిచింది.