
న్యూఢిల్లీ: భారత క్రికెట్‌లోకి తారాజువ్వలా దూసుకొచ్చిన యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ భవితవ్యం డైలమాలో పడినట్లే కనబడుతోంది. ఇటీవల కాలంలో పంత్ నిర్లక్ష్యంగా ఆడటంతో పాటు ఒకే తరహాలో ఔట్ కావడం టీమిండియా మేనేజ్‌మెంట్‌కు సవాల్‌గా మారింది. ఎంఎస్ ధోనికి సరైన ప్రత్యామ్నాయం రిషభ్ పంత్ అని భావించినా అది కాస్తా మూన్నాళ్ల ముచ్చెటే అవుయినట్లు తెలుస్తోంది. మళ్లీ దేశవాళీ టోర్నీలో పంత్ తానేంటో నిరూపించుకునే వరకూ అతనికి అవకాశాలు ఇవ్వకూడదనే యోచనలో మేనేజ్‌మెంట్ ఉంది. వరల్డ్‌కప్ నుంచి ఇప్పటివరకూ చూస్తే పంత్ ఆడిన ఏ ఒక్క ఇన్నింగ్స్ కూడా భారత్ మేనేజ్‌మెంట్‌కు సంతృప్తి నివ్వలేదు.
అయినా పంత్‌లో సత్తాను దృష్టిలో పెట్టుకుని దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌లో అవకాశం కల్పించారు. అక్కడ కూడా పంత్ తీవ్రంగా నిరాశపరిచాడు. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి బదులు మళ్లీ నిర్లక్ష్యమే కనిపించింది. ప్రత్యర్థి బౌలర్లు ఊరిస్తూ వేస్తున్న బంతులకు పంత్ భారీ షాట్లకు పోయి వికెట్లు సమర్పించుకుంటున్నాడు.దాంతో దక్షిణాఫ్రికాతో జరుగనున్న మూడు టెస్టుల సిరీస్‌కు పంత్‌ను పక్కకు పెట్టాలని చూస్తున్నారు. ఇప్పటివరకూ పంత్‌కు అండగా నిలిచిన కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లిలు సైతం అతన్ని కొన్నేళ్లు పక్కన పెట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. సఫారీలతో టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో పంత్‌ను ఆడించి చూద్దామని సెలక్టర్లు అనుకున్నప్పటికీ అందుకు కోహ్లి, రవిశాస్త్రిలు వద్దనే చెప్పారట. పంత్ స్థానంలో వృద్ధిమాన్ సాహాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
పంత్ స్థానాన్ని సాహాతో భర్తీ చేయడానికి ఇప్పటికే సిద్ధమైనట్లు సమాచారం. పంత్ ఒక వరల్డ్‌క్లాస్ ఆటగాడని రవిశాస్త్రి చెబుతున్నప్పటికీ అతని ఆటపై ఎక్కడో కాస్త అనుమానం ఉండటంతో రిస్క్ చేయదల‍్చుకోవడానికి సిద్ధంగా లేడు. ఇందుకు కోహ్లి నుంచి రవిశాస్త్రి మద్దతు ఉండటంతో పంత్‌కు ఉద్వాసన చెప్పినట్లేనని కథనాలు వెలువడుతున్నాయి. బ్యాటింగ్, కీపింగ్‌ల్లో పంత్ పెద్దగా ఆకట్టుకోలేకపోవడం ఒకటైతే, వికెట్ల వెనుక కీపర్ స్థానంలో డీఆర్‌ఎస్ విషయంలో స్పష్టమైన అవగాహనతో ఉండాలి. ఇందులో కూడా పంత్ విఫలమవుతూ వస్తున్నాడు. ప్రత్యేకంగా భారత్ వంటి బంతి టర్న్ అయ్యే పిచ్‌ల్లో డీఆర్‌ఎస్‌ను నిర్దారించడంలో పంత్ ఇబ్బంది పడుతున్నాడు. మరొకవైపు వికెట్ల వెనుక పంత్ కంటే సాహానే అత్యుత్తమం అని కోహ్లి, శాస్త్రిలు భావిస్తున్నారు. దాంతో పంత్ స్థానంలో సాహాను సఫారీలతో తొలి టెస్టు నుంచే ఆడించాలని చూస్తున్నారు. ఒకవేళ దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో సాహాను ఆడించి అక్కడ మరోసారి తనను తాను నిరూపించుకుంటే మాత్రం పంత్ కెరీర్ సందిగ్థంలో పడటం ఖాయం.
Comments
Please login to add a commentAdd a comment