యశస్వి డబుల్‌ యశస్సు | Yashasvi Jaiswal Becomes Youngest To Hit List A Double Century | Sakshi
Sakshi News home page

యశస్వి డబుల్‌ యశస్సు

Published Thu, Oct 17 2019 3:16 AM | Last Updated on Fri, Oct 18 2019 8:50 AM

Yashasvi Jaiswal Becomes Youngest To Hit List A Double Century - Sakshi

బెంగళూరు: భారత క్రికెట్‌లో మరో కొత్త టీనేజీ సంచలనం! సంచలన బ్యాటింగ్‌ ప్రదర్శనలకు కేరాఫ్‌ అడ్రస్‌వంటి ముంబై మైదానాల నుంచి వచ్చిన మరో కుర్రాడు కొత్త ప్రపంచ రికార్డుతో సంచలనం సృష్టించాడు. ముంబైకి చెందిన యశస్వి భూపేంద్ర కుమార్‌ జైస్వాల్‌ అంతర్జాతీయ, దేశవాళీ వన్డేల్లో కలిపి (లిస్ట్‌–ఎ మ్యాచ్‌లు) అతి పిన్న వయసులో (17 ఏళ్ల 292 రోజులు) డబుల్‌ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో అతను ఈ సంచలన ప్రదర్శన నమోదు చేశాడు.

జార్ఖండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో యశస్వి 154 బంతుల్లో 17 ఫోర్లు, 12 సిక్సర్లతో 203 పరుగులు సాధించాడు. గతంలో దక్షిణాఫ్రికాకు చెందిన అలన్‌ బారో 20 ఏళ్ల 276 రోజుల వయసులో చేసిన డబుల్‌ సెంచరీ రికార్డును యశస్వి బద్దలు కొట్టాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన యశస్వికి తోడుగా ఆదిత్య తారే (78; 6 ఫోర్లు, సిక్స్‌) కూడా రాణించడంతో ముంబై 50 ఓవర్లలో 3 వికెట్లకు 358 పరుగులు చేసింది. అనంతరం 319 పరుగులకు ఆలౌటైన జార్ఖండ్‌ 38 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. విరాట్‌ సింగ్‌ (77 బంతుల్లో 100; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ  సాధించాడు.  

పానీపూరి నుంచి పరుగుల వరద వరకు...
11 ఏళ్ల వయసు... కానీ పెద్ద క్రికెటర్‌ కావాలనేది కల. అది నెరవేర్చుకోవాలంటే స్వస్థలం భదోహీ (ఉత్తర ప్రదేశ్‌)లో మాత్రం సాధ్యం కాదు. అందుకే దేనికైనా సిద్ధం అంటూ ‘చలో ముంబై’ అన్నాడు. సొంతూర్లో తండ్రిది చిన్న కిరాణా కొట్టు. ఇద్దరు పిల్లల పోషణ కూడా ఆయనకు భారంగా అనిపించి నీ ఇష్టం అనేశాడు. దూరపు బంధువొకరు ముంబైలో ఉంటే ఆయనను నమ్ముకొని బయల్దేరాడు. ఏదైనా పని ఇప్పిస్తానంటూ డెయిరీ దుకాణంలో నౌకరీ ఇప్పించిన ఆ బంధువు ఇల్లు మాత్రం రెండో మనికి అవకాశమే లేనంత చిన్నది! దాంతో తను పని చేస్తున్న చోటే రాత్రి కూడా పడుకోవడం మొదలు పెట్టాడు. అయితే రోజంతా పనికంటే క్రికెట్‌పైనే ఎక్కువ శ్రద్ధ పెట్టడంతో వారు పనికిరావంటూ పంపించేశారు. దాంతో కథ మళ్లీ మొదటికొచి్చంది. మళ్లీ అదే బంధువు ఆదుకుంటూ తాను పని చేస్తున్న ‘ముస్లిం యునైటెడ్‌ క్లబ్‌’ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఒక మూలన ఉండే టెంట్‌లో ఆ అబ్బాయిని ఉంచేందుకు అనుమతి తీసుకున్నాడు.

కనీసం విద్యుత్‌ సౌకర్యం కూడా లేకుండా ప్లాస్టిక్‌ కవర్లతో కప్పి ఉంచిన ఆ టెంటే అప్పటి నుంచి యశస్వి ప్రపంచమైపోయింది. స్థానికంగా క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడటం, యునైటెడ్‌ క్లబ్‌కు సంబంధించి గ్రౌండ్స్‌మన్‌తోనే ఉంటూ వారికి రోటీలు చేసి పెట్టడం అతని రోజువారీ పని. తనకంటే వయసులో పెద్దవారితో క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడితే 200–300 రూపాయలు వచ్చేవి. వాటినే ఎంతో పొదుపుగా వాడుకోవాల్సి వచ్చేది. ముంబైలోని ఆజాద్‌ మైదాన్‌లో రామ్‌లీలా ఉత్సవాలు, ఇతర కార్యక్రమాలు జరిగినప్పుడు యశస్వి అక్కడ పానీ పూరీలు కూడా అమ్మాడు! తనతో ఆడే కుర్రాళ్లు ఆ సమయంలో పానీపూరీ తినేందుకు తన వద్దకు రావద్దని అతను కోరుకునే పరిస్థితి. టెంట్‌లో ఉంటున్న సమయంలో తాను ఆకలితో పడుకున్న రాత్రులు కూడా ఎన్నో ఉన్నాయి. కష్టాల జాబితా చూస్తే అంతు లేదు. కానీ అతను వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అన్ని బాధలు భరిస్తూ కూడా క్రికెటర్‌ కావాలనే తన లక్ష్యానికి మాత్రం దూరం కాలేదు.

యశస్వి గాథలు ఆజాద్‌ మైదాన్‌లో చాలా మందికి చేరాయి. సహజ ప్రతిభావంతుడైన ఒక కుర్రాడిని అండగా నిలవాల్సిన అవసరం తెలిసింది. వీరిలో ఒక స్థానిక కోచ్‌ జ్వాలా సింగ్‌ అందరికంటే ముందుగా స్పందించాడు. యశస్విలాంటి నేపథ్యంతోనే అదే ఉత్తర ప్రదేశ్‌ నుంచి వచ్చి పెద్ద స్థాయికి చేరలేకపోయిన జ్వాలా సింగ్‌కు బహుశా అతనిలో తన ప్రతిరూపం కనిపించి ఉంటుంది! అందుకే ఈ కుర్రాడిని చేరదీసి ఆటను తీర్చిదిద్ది ముందుకు నడిపించాడు. అతని ప్రోత్సాహంతో ముందుకు వెళ్లిన యశస్వి స్థానిక లీగ్‌లలో పరుగుల వరద పారించాడు. గత ఐదేళ్లలో అన్ని స్థాయిల మ్యాచ్‌లలో కలిపి అతను దాదాపు 50 సెంచరీలు బాదాడు. వేర్వేరు వయో విభాగాల్లో ఈ అసాధారణ ప్రదర్శన అతడికి ముంబై అండర్‌–19 జట్టులో, ఆ తర్వాత భారత అండర్‌–19 జట్టులో చోటు కల్పించింది.

గత ఆగస్టులో ఇంగ్లండ్‌లో అండర్‌–19 ముక్కోణపు టోరీ్నలో ఫైనల్లో సహా మొత్తం నాలుగు అర్ధ సెంచరీలతో జట్టుకు టైటిల్‌ అందించిన అతను ఇప్పుడు సీనియర్‌ స్థాయిలో కూడా సత్తా చాటుతున్నాడు. సరిగ్గా రెండేళ్ల క్రితం జరిగిన అండర్‌–19 ఆసియా కప్‌ టోర్నీతో యశస్వికి మొదటిసారి గుర్తింపు లభించింది. భారత్‌ విజేతగా నిలిచిన ఆ టోరీ్నలో యశస్వి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ పురస్కారాన్ని అందుకున్నాడు. అప్పటి నుంచి అతని ఆట మరింత జోరందుకుంది. ముంబై సీనియర్‌ టీమ్‌కు ఎంపిక కావడం అతని కెరీర్‌లో కీలక మలుపు. 44, 113, 22, 122, 203... విజయ్‌ హజారే ట్రోఫీలో యశస్వి జైస్వాల్‌ వరుస స్కోర్లు ఇవి. ఆడిన ఐదు మ్యాచ్‌లలో మూడు సెంచరీలు ఉన్నాయి. అందులో ఒక డబుల్‌ సెంచరీ కూడా. వీటిని చూస్తే యశస్వి ప్రదర్శన ఒక సంచలన ఇన్నింగ్స్‌కే పరిమితం కాదని, అతని ఆటలో ఎంత నిలకడ ఉందో అర్థమవుతుంది. తాజా ప్రదర్శన యశస్విని భవిష్యత్‌ తారగా ఆశలు రేపేలా చేసింది. 

మ్యాచ్‌లు ఆడేటప్పుడు లంచ్‌ విరామం సమయంలో నా సహచరులు లేదా వాళ్ల  తల్లిదండ్రులు మంచి భోజనాలు తీసుకు రావడం చాలా సార్లు చూశాను. నేను మాత్రం ఏదైనా వండుకుంటేనే తినే పరిస్థితి. బ్రేక్‌ ఫాస్ట్‌ అనేది దాదాపుగా లేనట్లే. వాళ్లలోనే ఎవరో ఒకరిని బతిమాలి పని కానిచ్చేయడమే. ఈ విషయంలో నేను ఏమాత్రం సిగ్గు పడకపోయేవాడిని. ‘డబ్బులు లేవు కానీ ఆకలి మాత్రం ఉంది’ అంటూ వారిని అడిగి తినేందుకు సిద్ధపడిపోయేవాడిని.నా పరిస్థితి చూసుకున్నప్పుడు చాలా సార్లు తల్లిదండ్రులు గుర్తుకొచ్చి ఏడుస్తూ కుమిలిపోయేవాడిని.

వేసవిలో ప్లాస్టిక్‌ టెంట్‌లో పడుకున్నప్పుడు వేడితో చచి్చపోయేవాడిని. దాంతో గ్రౌండ్‌లోనే పడుకునేందుకు సిద్ధమైపోయా. అయితే ఒక రాత్రి ఏదో పురుగు కుట్టి కన్ను వాచిపోవడంతో ఆ తర్వాత ఎంత వేడి అయినా టెంట్‌లోకే మారిపోయా. క్రికెట్‌లో ఒత్తిడి అనే మాటే నాకు తెలీదు. ఎన్నో ఏళ్లుగా రోజూ అనుభవించిన వాడిని. బరిలోకి దిగితే పరుగులు చేయగలనని నమ్మకం ఉండేది కానీ ఆ రోజు భోజనం దొరుకుతుందా లేదా అనే దాని గురించే ఆందోళన
చెందిన రోజులు ఉన్నాయి.
–యశస్వి జైస్వాల్‌

లిస్ట్‌–ఎ క్రికెట్‌లో భారత్‌ ‘డబుల్‌ సెంచరీ’ హీరోలు
అంతర్జాతీయ క్రికెట్లో...
►రోహిత్‌ శర్మ 264 (శ్రీలంకపై, కోల్‌కతాలో 2014)
►రోహిత్‌ శర్మ 209 (ఆ్రస్టేలియాపై, బెంగళూరులో 2013)
►రోహిత్‌ శర్మ 208 నాటౌట్‌ (శ్రీలంకపై, మొహాలీలో 2017)
►సచిన్‌ టెండూల్కర్‌ 200 నాటౌట్‌ (దక్షిణాప్రికాపై, గ్వాలియర్‌లో 2010)
►వీరేంద్ర సెహా్వగ్‌ 219 (వెస్టిండీస్‌పై, ఇండోర్‌లో 2011)

దేశవాళీ క్రికెట్లో...
►శిఖర్‌ ధావన్‌ 248 (దక్షిణాఫ్రికా ‘ఎ’పై, ప్రిటోరియాలో 2013)
►కరణ్‌ కౌశల్‌ 202 (సిక్కింపై, గుజరాత్‌లో 2018)
►సంజూ సామ్సన్‌ 212 నాటౌట్‌ (గోవాపై, బెంగళూరులో 2019)
►యశస్వి జైస్వాల్‌ 203 (జార్ఖండ్‌పై, బెంగళూరులో 2019)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement