న్యూఢిల్లీ: సందర్భం దొరికినప్పుడల్లా టీమిండియా క్రికెటర్లపై విమర్శనాస్త్రాలు సంధించే మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ మరోసారి తన నోటికి పని చెప్పాడు. గత కొంతకాలంగా భారత్ జట్టుకు దూరంగా ఉంటున్న ఎంఎస్ ధోనిపై సుతిమెత్తగా విమర్శలు చేశాడు. అసలు జట్టుకు ధోని ఎందుకు దూరంగా ఉంటున్నాడో చెప్పాలన్న గంభీర్.. తనకు నచ్చిన సిరీస్‌ల్లో ఆడతానంటే కుదురనేది విషయం తెలుసుకోవాలన్నాడు. ‘ రిటైర్మెంట్ అనేది వారి వ్యక్తిగత నిర్ణయం. ఇక్కడ ధోని అయినా వేరే వాళ్లయినా వారు ఇష్టమున్నప్పుడు రిటైర్ అవుతారు. ఇదే విషయాన్ని నేను పదేపదే చెబుతున్నాను కూడా. ధోనితో సెలక్టర్లు మాట్లాడి అతని ప్రణాళిక ఏమిటో తెలుసుకోవాలి. అసలు భారత్‌కు మళ్లీ ఆడతాడా.. లేదా అనే విషయాన్ని అడిగి తెలుసుకోండి. టీమిండియాకు ఆడాలనుకుంటే నీకు నచ్చిన సిరీస్‌లను ఎంపిక చేసుకుంటానంటే కుదరదు’ అని గంభీర్ పేర్కొన్నాడు.
ఇక యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను తొలగించాలంటూ ఇటీవల టీమిండియా మేనేజ్‌మెంట్‌కు సూచించిన గంభీర్.. అతనికి మరిన్ని అవకాశాలు ఇస్తేనే సబబుగా ఉంటుందని మాట మార్చాడు. ‘ రిషభ్ పంత్‌కు టీమిండియా మేనేజ్‌మెంట్ అండగా నిలబడాలి. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి పంత్ చాలా తక్కువ సమయమే అవుతున్నందున అతనిపై ప్రధానంగా దృష్టి సారించాలి. టెస్టుల్లో పంత్ ఇప్పటికే రెండు సెంచరీ చేశాడు. ఈ శతకాలు చేయడానికి పంత్ పెద్దగా సమయం తీసుకోలేదు. అతని స్టైల్‌లోనే పంత్‌ను ఆడనివ్వండి. పంత్ ఆటపై ఇప్పుడే విమర్శలు చేసి అతనిపై ఒత్తిడి పెంచడం సరైనది కాదు’ అని గంభీర్ మద్దతుగా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment