న్యూఢిల్లీ: అన్ని ఫార్మాట్లలోనూ తనదైన ముద్రవేసి.. అద్భుతమైన రికార్డులు సొంతం చేసుకున్న ఘనత టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి సొంతం. సారథిగా జట్టును ముందుండి నడిపించిన తీరు, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా వ్యక్తిగతంగా నమోదు చేసిన రికార్డుల్లోనూ అతడికి అతడే సాటి. భారత్‌కు రెండు ప్రపంచ కప్‌లు, చాంపియన్స్ ట్రోఫీ సాధించి పెట్టిన ఈ కెప్టెన్ కూల్ ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత.. అతడి స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడు ఎవరన్న అంశంపై క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది. అలాంటి తరుణంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న రిషభ్ పంత్ అందరి దృష్టిని ఆకర్షించాడు. పొట్టి ఫార్మాట్‌లో మెరుగ్గా రాణించిన ఈ ఢిల్లీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అనతికాలంలోనే జాతీయ జట్టులో చోటు సంపాదించడమేగాక, తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సెలక్టర్ల నిర్ణయం సరైందని నిరూపించాడు కూడా.(చదవండి: ‘సంజూ గ్రేట్.. పంత్ నువ్వు హల్వా, పూరీ తిను’)
ఇక అప్పటి నుంచి పంత్‌ను ధోనితో పోల్చడం క్రికెట్ ప్రేమికులకు పరిపాటిగా మారింది. కానీ గత కొంతకాలంగా రిషభ్ పంత్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వికెట్ కీపర్ స్థానాన్ని కేఎల్ రాహుల్ భర్తీ చేయడంతో మెల్లగా అతడికి అవకాశకాలు సన్నగిల్లాయి. ఈ విషయం గురించి టీమిండియా మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొలుత పంత్‌ను ధోనితో పోల్చడం మానుకోవాలని సూచించాడు. ‘‘పంత్ ఎప్పటికీ ధోని కాలేడు. అతడిని రిషభ్ పంత్‌గానే ఉండనివ్వండి.
మీడియా ఈ పోలిక గురించి మాట్లాడినంత కాలం, పంత్ సైతం తనకు అవకాశాలు వస్తాయని భావిస్తూనే ఉంటాడు. ఎంఎస్ ధోనిలాగా సిక్సర్లు కొట్టినంత మాత్రాన ఎవరూ ధోనిలా అయిపోరు. రిషభ్ పంత్ తన ఆటతీరును ఇంకా మెరుగపరచుకోవాల్సి ఉంది. కీపింగ్, బ్యాటింగ్‌పై దృష్టి సారించాల్సిన అవశ్యకత ఉంది’’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు. కాగా ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో బీసీసీఐ ఇటీవల ప్రకటించిన జట్టు(టెస్టు)లో పంత్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.(చదవండి: ఆసీస్ టూర్.. టీమిండియా జట్టు ఎంపిక..)
Comments
Please login to add a commentAdd a comment