యువరాజ్ సింగ్ (ఫైల్ ఫొటో)
హైదరాబాద్ : టీమిండియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ తడబాటును అతని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సరిగ్గా 12 ఏళ్ల క్రితం అసలు సిసలు టీ20 గేమ్ అంటే ఎంటో యువీ భారత అభిమానులకు చూపించాడు. 2007 దక్షిణాఫ్రికా వేదికగా సాగిన తొలి టీ20 ప్రపంచకప్ టోర్నీలో 6 బంతులకు 6 సిక్స్‌లు బాది తానెంత వైవిధ్యమైన ఆటగాడినో అని ప్రపంచానికి తెలియజేశాడు. బంతిని అలవోకగా స్టాండ్స్‌కు తరలించే యువీ.. అదే బంతితో బ్యాట్స్‌మన్‌ను ఇబ్బంది పెట్టాడు. ఎడమ చేతివాటం స్పిన్నర్‌గా ఎన్నో కీలక మ్యాచ్‌ల్లో టీమిండియాకు చిరస్మరణీయ విజయాలనందించాడు. ముఖ్యంగా 2011 ప్రపంచకప్ భారత్ గెలవడంలో యువీ కీలక పాత్ర పోషించాడు. అవసరమైనప్పుడల్లా బంతి, బ్యాట్‌తో జట్టుకు అండగా నిలిచి మ్యాన్ ఆఫ్ ద టోర్నీగా నిలిచాడు. ఇలా యువరాజ్ ఘనతల గురించి ఎంత చెప్పినా తక్కువే.
కలిసి రాని ఐపీఎల్..
ప్రతి ఒక్కరి జీవితంలో ఓ గడ్డుకాలం ఉంటుందంటారు. అలా యువరాజ్ జీవితంలో ఐపీఎల్ కొరకరాని కొయ్యలా తయారైంది. ప్రతీ ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికిన యువరాజ్ తన స్థాయికి తగ్గ ప్రదర్శనను కనబర్చలేకపోయాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో కింగ్స్ పంజాబ్, పుణె వారియర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌లకు ప్రాతినిథ్యం వహించిన యువీ ఏ జట్టు తరుఫున రాణించలేకపోయాడు. నిలకడలేమి ఫామ్‌తో భారత జట్టుకు దూరమైన యువీ.. ఈ సీజన్‌లో రాణించి తుది జట్టులోకి రావాలని బరిలోకి దిగాడు. ఈ సీజన్ తనకు ప్రత్యేకమైనదని కూడా వెళ్లడించాడు. కానీ టీమిండియాలో చోటు ఏమో కానీ కింగ్స్ పంజాబ్ తుది జట్టులో స్థానం కోసం నిరీక్షించాల్సి వచ్చింది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకవపోవడంతో యువీ ఎక్కువగా బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఆరు మ్యాచ్‌లు ఆడిన ఈ 36 ఏళ్ల పంజాబ్ ఆటగాడు కేవలం 65 పరుగులు మాత్రమే చేశాడు. అటు బంతితోను ఒక్క వికెట్ సాధించలేదు. ఈ ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌కు సైతం దూరమయ్యాడు.
సోషల్ మీడియాలో విమర్శలు
యువరాజ్ సింగ్ ప్రదర్శనపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. ఆటకు వీడ్కోలు చెప్పడం మంచిదని కూడా సలహా ఇచ్చారు. ఇక యువీ డై హార్డ్ ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన క్రికెటర్ ఆటను చూడలేకపోతున్నామని, 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదిన మేటి ఆటగాడు ఇలా తడబడటం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకొందరు అందరికి గడ్డు కాలం వస్తోందని, ప్రస్తుతం యువీకి అదికొనసాగుతోందని, త్వరలోనే యువీ ఎంటో నిరూపిస్తాడని మరికొందరు మద్దతు పలుకుతున్నారు. 304 అంతర్జాతీయ వన్డేలా ఆడిన యువీ ఓ సందర్భంలో 18 ఏళ్ల నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నానని, 2019 ప్రపంచకప్ అనంతరం క్రికెట్‌కు గుడ్‌బై చెప్తానని స్పష్టం చేశాడు. అయితే ఈ తరహా ప్రదర్శనతో యువీ ప్రపంచకప్ ఆడటం అసాధ్యమని క్రీడావిశ్లేషకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment