
రా.. రా... రాయుడు
వడోదర: భారత టెస్టు జట్టులో తెలుగు తేజం అంబటి రాయుడుకు తొలిసారిగా చోటు దక్కింది. దక్షిణాఫ్రికాలో పర్యటించే భారత వన్డే, టెస్టు జట్టును సోమవారం సెలక్టర్లు ప్రకటించారు. సుదీర్ఘ కాలంగా జాతీయ జట్టులో చోటు కోసం ఎదురుచూసిన రాయుడు గత ఆగస్టులో జింబాబ్వే పర్యటనలో తొలిసారి వన్డే ఆడాడు. ప్రస్తుతం వన్డే జట్టుతో పాటు ఉన్నా తుది జట్టులో స్థానం దక్కడం లేదు. అయితే అనూహ్యంగా దక్షిణాఫ్రికా పర్యటనలో అటు వన్డేలు, ఇటు టెస్టు జట్టులోనూ రాయుడికి స్థానం దక్కింది. దీంతో వీవీఎస్ లక్ష్మణ్ తర్వాత మరోసారి రాష్ట్ర ఆటగాడికి స్థానం లభించినట్టయ్యింది. అలాగే ఏడాది కాలంగా ఫామ్‌లో లేక జట్టుకు దూరమైన పేసర్ జహీర్ ఖాన్‌ను సెలక్టర్లు కరుణించారు. కానీ రంజీల్లో రాణిస్తున్న ఓపెనర్ గౌతం గంభీర్‌ను దూరం పెట్టారు. టెస్టు జట్టును 17 మందితో, వన్డే జట్టును 16 మందితో ఎంపిక చేశారు.
డిసెంబర్ 5 నుంచి మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. ఆ తర్వాత 18 నుంచి రెండు టెస్టుల సిరీస్ జరుగుతుంది. టెస్టు సిరీస్‌కు ముందు జట్టు రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. సచిన్ టెండూల్కర్ టెస్టుల నుంచి తప్పుకున్న అనంతరం భారత జట్టు తొలిసారిగా బరిలోకి దిగనుంది. ‘గంభీర్ పేరు చర్చకు వచ్చింది. చాలా విషయాలు మేం చర్చించాం. కెప్టెన్ ధోనితో కూడా సంప్రదించాం. జట్ల ఎంపిక ఏకగ్రీవంగా జరిగింది’ అని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ అన్నారు.
గత డిసెంబర్‌లో జహీర్ చివరిసారిగా ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్ ఆడాడు. గాయం, ఫామ్‌లో లేకపోవడంతో ఈ పేసర్ జట్టుకు దూరమయ్యాడు. అయితే పునరాగమనం కోసం కఠిన శిక్షణ తీసుకోవడమే కాకుండా ప్రస్తుత రంజీ సీజన్‌లో మూడు మ్యాచ్‌ల్లోనే 13 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అయితే జహీర్‌ను వన్డే జట్టులోకి పరిగణలోకి తీసుకోలేదు. అలాగే సెహ్వాగ్, హర్భజన్‌లను కూడా పక్కనబెట్టారు. టెస్టు జట్టులో బ్యాకప్ వికెట్ కీపర్‌గా వృద్ధిమాన్ సాహా ఉంటాడు. వెస్టిండీస్‌తో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌కు గాయం కారణంగా దూరమైన జడేజా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇతర స్పిన్నర్లుగా అశ్విన్, ఓజా ఉంటారు. అమిత్ మిశ్రాకు వన్డే జట్టులో మాత్రమే చోటు దక్కింది. ఆసీస్‌తో జరిగిన ఏడు వన్డేల సిరీస్‌లో ధారాళంగా పరుగులు సమర్పించిన ఇషాంత్ శర్మను వన్డే జట్టులో కూడా ఉంచారు. జయదేవ్ ఉనాద్కట్, వినయ్ కుమార్‌లు వన్డేల్లో చోటు కోల్పోయారు. ఉమేశ్ యాదవ్, రహానే రెండు జట్లలోనూ ఉన్నారు.
సచిన్ ‘స్థానం’లో కోహ్లి!
ఓవరాల్‌గా టెస్టు జట్టులో ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్, ఇద్దరు వికెట్ కీపర్లు, ఐదుగురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు, ఒక ఆల్‌రౌండర్ ఉన్నాడు. మురళీ విజయ్, శిఖర్ ధావన్ ఇన్నింగ్స్‌ను ఆరంభించనుండగా టెండూల్కర్ స్థానంలో విరాట్ కోహ్లి వచ్చే అవకాశం ఉంది. మూడో నంబర్‌లో పుజారా, రోహిత్ ఐదో స్థానంలో రానుండగా రహానే, జడేజాలలో ఒకరు జట్టు కూర్పులో భాగంగా బరిలోకి దిగుతారు. తుది జట్టులో జహీర్‌తో పాటు... షమీ, ఇషాంత్, భువనేశ్వర్, ఉమేశ్‌లలో ఇద్దరు బరిలోకి దిగే అవకాశం ఉంది.