
ఇరగదీసిన ఇర్విన్
బ్యాటింగ్‌లో దుమ్మురేపిన జింబాబ్వే...
కివీస్‌పై జింబాబ్వే అద్భుత విజయం
హరారే: బ్యాటింగ్‌లో దుమ్మురేపిన జింబాబ్వే... తొలి వన్డేలో న్యూజిలాండ్‌కు షాక్ ఇచ్చింది. క్రెయిగ్ ఇర్విన్ (108 బంతుల్లో 130 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ సెంచరీకి తోడు మసకద్జా (99 బంతుల్లో 84; 10 ఫోర్లు) సమయోచితంగా స్పందించడంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 7 వికెట్ల తేడాతో కివీస్‌పై అద్భుత విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 303 పరుగులు చేసింది. రాస్ టేలర్ (122 బంతుల్లో 112 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకం చేయగా, కేన్ విలియమ్సన్ (102 బంతుల్లో 97; 11 ఫోర్లు, 1 సిక్స్) తృటిలో చేజార్చుకున్నాడు.
తర్వాత జింబాబ్వే 49 ఓవర్లలో 3 వికెట్లకు 304 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్లు మసకద్జా, చిబాబా (42) తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. తర్వాత ఇర్విన్ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. మూడు కీలక భాగస్వామ్యాలతో జట్టును గెలిపించాడు. నాథన్ మెకల్లమ్ 3 వికెట్లు తీశాడు. ఇర్విన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే మంగళవారం జరుగుతుంది.