
అరసవల్లి: సంపూర్ణ చంద్ర గ్రహణం నేపథ్యంలో జిల్లాలోని ప్రముఖ ఆలయాలు బుధవారం మూతపడనున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరసవల్లి శ్రీసూర్యనారాయణస్వామి వారి ఆలయాన్ని ఉదయం 8 నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు మూసి వేస్తున్నట్లు ఆలయ ఈవో వి.శ్యామలాదేవి, ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మలు మంగళవారం తెలిపారు. ఆ తరువాత నుంచి భక్తులకు సర్వదర్శనాలుంటాయన్నారు. బుధవారం సాయంత్రం 5.17 నుంచి రాత్రి 8.42 గంటల వరకు రాహుగ్రస్త చంద్ర గ్రహణ సమయం ఉంటుందని, దీంతో ఉదయం 8 గంటలకు స్వామి వారికి నిత్యార్చన చేసి, ఆలయ తలుపులు మూసివేయనున్నట్టు పేర్కొన్నారు. ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి నాడు ఆలయ ప్రాంగణంలో చేపడుతున్న సహస్ర దీపాలంకరణ సేవను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఈవో వెల్లడించారు.
శ్రీకూర్మం, శ్రీముఖలింగం ఆలయాలు కూడా..
గార మండలంలోని శ్రీకూర్మం ఆలయాన్ని బుధవారం 12 గంటల తరువాత మూసి వేయనున్నారు. తిరిగి గురువారం తెల్లవారు జామున సంప్రోక్షణం తరువాత స్వామి దర్శనానికి భక్తులకు అనుమతిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. అలాగే జలుమూరు మండలం శ్రీముఖలింగం ఆలయాన్ని కూడా బుధవారం ఉదయం నుంచి మూసి వేయనున్నారు. గురువారం తెల్లవారుజామున సంప్రోక్షణ పూజలు చేసిన తరువాత భక్తులను అనుమతిస్తారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని సంబంధిత అధికారులు సూచించారు