సెల్ఫీ దిగుతూ కాల్వలో పడిన విద్యార్థులు
ఖమ్మం జిల్లా టేకులపల్లిలో విషాదం చోటుచేసుకుంది.
టేకులపల్లి: ఖమ్మం జిల్లా టేకులపల్లిలో విషాదం చోటుచేసుకుంది. సాగర్ కాలువ పక్కన నిలబడి సెల్ఫీ దిగడానికి యత్నించిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు కాలువలో కొట్టుకు పోయారు. ఈ సంఘటన టేకులపల్లి వంతెన వద్ద శనివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. విజయ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న నలుగురు విద్యార్థులు ఈ రోజు టేకులపల్లి సాగర్ కాలువ వంతెన వద్ద సెల్ఫీ దిగుతుండగా.. ఇద్దరు యువకులు కాలువలో పడి గల్లంతయ్యారు. ఎర్రుపాలెం మండలం ఎనగల గ్రామానికి చెందిన ముచింతల నాగరాజు(20), కృష్ణా జిల్లా జీకొండూరు మండలం మునగపాడుకు చెందిన పరమేశ్వర్ రెడ్డి(21) విజయ ఇంజనీరింగ్ కళాశాలలో అగ్రికల్చర్ బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నారు.
వీరు ఇందిరానగర్ బాలాజీ బాయ్స్ హాస్టల్‌లో ఉంటూ చదువు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో హాస్టల్‌కు చెందిన మరో ఇద్దరు స్నేహితులు సుధాకర్, శ్రీనివాస్‌లతో కలిసి టేకులపల్లి సాగర్ కాలువ వంతెన వద్ద నిలబడి సెల్ఫీ తీసుకుంటుండగా.. ప్రమాద వశాత్తు నాగరాజు, పరమేశ్వర్ రెడ్డి కాలువలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన స్నేహితులు స్థానికుల సాయంతో వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.